బ్రో సినిమా: పార్టీ ఆఫీస్ లోనే డబ్బింగ్ చెప్పిన పవన్ కళ్యాణ్; టీజర్ రిలీజ్ పై సస్పెన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ చాలా బిజీగా ఉన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నారు పవన్. గతకొన్ని రోజులుగా విజయ యాత్రలో ఉన్న పవన్, బ్రో సినిమా టీజర్ డబ్బింగును కూడా పార్టీ ఆఫీసులోనే పూర్తి చేసారు. ఈ మేరకు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెబుతున్న కొన్ని ఫోటోలను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ ఫోటోల్లో చిత్ర దర్శకుడు సముద్ర ఖని కూడా ఉన్నారు. బ్రో టీజర్ కు పవన్ డబ్బింగ్ పూర్తయ్యిందని, అనౌన్స్ మెంట్ ఒక్కటే మిగిలిందని చిత్ర నిర్మాణ సంస్థ పోస్టు పెట్టింది.
ఆసక్తిని పెంచిన లుంగీ పోస్టర్లు
తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్ గా బ్రో మూవీ రూపొందుతోంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటివరకు బ్రో సినిమా నుండి టైటిల్ గ్లింప్స్, పోస్టర్లు తప్ప ఇంకేం రిలీజ్ కాలేవు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లుంగీ కట్టుకున్న పోస్టర్లు నిన్న రిలీజై అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేసాయి. ఈ సినిమాలో దేవుడిగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. సాయి ధరమ్ తేజ్ సామాన్యుడిగా మార్కాండేయులు అనే పాత్రలో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జులై 28న బ్రో సినిమా విడుదల అవుతుంది.