
Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు రివ్యూ.. పవన్ కళ్యాణ్ పీరియాడికల్ యాక్షన్ సినిమా ఎలా ఉందంటే..
ఈ వార్తాకథనం ఏంటి
బ్రో తర్వాత పూర్తిగా రాజకీయాలకు పరిమితమైపోయాడు పవన్ కళ్యాణ్. ఆ తరవాత ఆయన నుంచి వచ్చిన చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం ప్రారంభమైనదానికి ఇప్పటికే ఐదేళ్లు పూర్తవుతున్నా, ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని చివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి పవన్ చెప్పినట్టుగానే ఇది రికార్డుల్ని అదిరిపోయిందా లేదా అన్నది పూర్తిస్థాయి సమీక్షలో చూద్దాం.
వివరాలు
కథ విషయానికొస్తే:
వీరమల్లు (పవన్ కళ్యాణ్) ఒక దొంగగా కనిపిస్తాడు.కానీ అతను రాబిన్ హుడ్ తరహాలో, ధనికుల నుంచి దోచి పేదలకు సాయం చేస్తుంటాడు. ఒక సందర్భంలో దొర (సచిన్ ఖేడ్కర్)నుంచి వచ్చిన పిలుపుతో అతను ఒక కోటకు వెళ్లుతాడు. అక్కడ పంచమి(నిధి అగర్వాల్)ను చూసి ప్రేమలో పడతాడు.ఆమె తనను దొరల చెరనుంచి తప్పించమని కోరడంతో వీరమల్లు అంగీకరిస్తాడు. అయితే అదే సమయంలో కుతుబ్ షాహీ రాజవంశం నుంచి మరో పిలుపు వస్తుంది.ఢిల్లీ లోని ఎర్రకోటలో ఉన్న నెమలి సింహాసనంపై కొలువైన కోహినూర్ వజ్రాన్ని దొంగిలించాల్సిందిగా వీరమల్లును కోరతారు. ఈ సింహాసనంపై కూర్చొన్నవాడు ఔరంగజేబ్ (బాబి డియోల్)..హిందువులను మతం మారకపోతే పన్నులు వేసి హింసించే నరరూప రాక్షసుడు.
వివరాలు
కథనం
అతని నుంచే కోహినూర్ వజ్రాన్ని తీసుకోవడమే వీరమల్లు లక్ష్యంగా ఢిల్లీ బాట పడతాడు.చివరికి అతను ఆ వజ్రాన్ని సాధించగలిగాడా లేదా అనేదే కథలో కీలకం. ఈ మధ్య కాలంలో పీరియాడిక్ సినిమాలు చాలా వస్తున్నాయి. అయితే అలాంటి కథలకి కావాల్సిన సాంకేతికత, విజువల్‌గా మద్దతివ్వాలి. అలా కాకపోతే ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. హరిహర వీరమల్లు విషయంలో ఇదే పెద్ద లోపం. 30 రోజుల షూటింగ్‌ను 3 రోజులు చేయడం,8 గంటల కాల్షీటును 2 గంటలకు పరిమితం చేయడం వంటివి సినిమా నిర్మాణ నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపించాయి. అన్నీ తెలిసినప్పటికీ పవన్ ఉన్నాడుకదా అన్న ఆశతో ప్రేక్షకులు ఎదురు చూసారు.
వివరాలు
కథనం
కానీ సినిమా చూసిన తర్వాత ఆ ఆశ కూడా పోయింది.ఫస్ట్ హాఫ్ చూసినపుడు కొన్ని సన్నివేశాలు ఊహించదగినవైనప్పటికీ,ఎలివేషన్ సీన్స్ బాగుండడంతో ఓ మంచి ప్రయత్నం అనిపించింది. అభిమానులలో సినిమా బాగానే ఉండబోతుందన్న నమ్మకం కలిగింది.అయితే సెకండ్ హాఫ్ మొదలయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా విడుదల కాకపోయి ఉంటే బాగుండేది అని చాలా మంది పవన్ అభిమానులు కూడా కచ్చితంగా మనసులో అనుకొని ఉంటారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ (CG) పరంగా సినిమాకు తీవ్ర నష్టం జరిగింది. చిన్న సినిమాలకే బాగా గ్రాఫిక్స్ చేస్తున్న ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ స్థాయిలోని హీరో సినిమా విజువల్ పరంగా ఇంత బాగా చేయకపోవడంలో ఎవరి తప్పో అనేది ప్రశ్నార్థకం.
వివరాలు
కథనం
ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద కూడా కొంత బాధ్యత ఉంది. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు ఇలాంటి కథను అంగీకరించడం, అనంతరం డేట్స్ సమర్పించకపోవడమే ప్రధాన కారణం. అందుకే దర్శక నిర్మాతలతోపాటు ఆయనపై కూడా విమర్శలు రావడం సహజం. ఆయన ఇవ్వలేని డేట్స్‌కి సినిమాను ఊపిరాడకుండా చుట్టేయడంతో సినిమాకు నష్టమే జరిగింది. సినిమాలో బాగా ఉన్న కొన్ని సన్నివేశాలు సైతం CG వర్క్ కారణంగా ప్రభావితమయ్యాయి. ఒక సమస్య వస్తుంది - హీరో వెళ్లి పరిష్కరిస్తాడు అనే పాత ఫార్ములాతో కథ నడిచింది. హిందూ ధర్మ పరిరక్షణ అనే పవర్‌ఫుల్ కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ, దానిని సరైన రీతిలో మలచలేదు. కథ ఎటు పోతుందో కూడా తెలియనంతగా తీర్చిదిద్దారు.
వివరాలు
నటీనటుల పనితీరు:
పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్టైల్, స్వాగ్ మళ్ళీ మాస్ స్క్రీన్‌పై కనిపించింది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన చేసిన యాక్షన్ సినిమాలు తక్కువే అయినప్పటికీ, ఈ సినిమాలో మాత్రం ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయనిపిస్తుంది. నిధి అగర్వాల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. బాబి డియోల్ ఔరంగజేబ్ పాత్రలో బాగా ఫిట్ అయ్యాడు. తనికెళ్ల భరణి, సత్యరాజ్, సునీల్ లాంటి పలువురు పాత్రధారులు ఉన్నారు. వీరందరూ తమ పాత్రల్ని బాగా పోషించారు.
వివరాలు
సాంకేతిక పరంగా:
ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి ప్రధాన బలం అని భావించినా , సినిమా చూసిన తర్వాత ఆయన మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. కొన్ని ప్రత్యేక సన్నివేశాల్లో మాత్రమే ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గొప్పగా అనిపించింది. ఎడిటర్ ప్రవీణ్ కెఎల్ ఫస్ట్ హాఫ్ వరకూ బాగా పని చేసినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో తాను ఏమీ చేయలేనంతగా పరిస్థితి మారిపోయింది. సినిమాటోగ్రఫీ పరంగా కూడా సినిమాకు పెద్దగా ఆకట్టుకోలేదు.
వివరాలు
సాంకేతిక పరంగా:
నిర్మాత క్వాలిటీ విషయంలో కాంప్రమైస్ ఆవాల్సి వచ్చింది. పవన్ డేట్స్ ఇవ్వలేదు కాబట్టి ఉన్నంతలో చుట్టేశారని స్పష్టంగా అర్థమవుతుంది. దర్శకులైన జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. "హిందూ ధర్మ పరిరక్షణ" అనే ప్రధాన అంశాన్ని తీసుకున్నప్పటికీ, దానిపై పూర్తిగా కథను కేంద్రీకరించలేకపోయారు. అంతేగాక, గుర్తుంచుకోదగ్గ సన్నివేశాలు ఎక్కువగా లేవు.