Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అంతర్జాతీయ గౌరవం.. 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్'గా బిరుదు
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో అపారమైన అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, గాయకుడిగా అనేక విభాగాల్లో తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజా నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇదే సమయంలో మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రావీణ్యాన్ని కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు లభించింది. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా పవన్ కళ్యాణ్ ఒక అరుదైన ప్రపంచ స్థాయి గౌరవాన్ని అందుకున్నారు.
Details
రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందే మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం
మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఈ గుర్తింపు లభించినట్టు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన సినిమాలు, రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందే మార్షల్ ఆర్ట్స్ ప్రయాణాన్ని ప్రారంభించటం విశేషం. ఈ రంగంలో ఆయన చూపిన దీర్ఘకాలిక నిబద్ధతను గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పవన్ కళ్యాణ్‌కు పలు ప్రతిష్ఠాత్మక గౌరవాలను అందించాయి. జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన 'సోగో బుడో కన్‌రి కై' నుంచి పవన్ కళ్యాణ్‌కు ఫిఫ్త్ డాన్ (ఐదవ డాన్) పురస్కారం లభించింది.
Details
తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర
అంతేకాకుండా జపాన్ వెలుపల 'సోకే మురమత్సు సెన్సై' ఆధ్వర్యంలోని 'టకెడా షింగెన్ క్లాన్'లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. జపాన్ వెలుపల ఈ స్థాయి గౌరవం లభించడం అత్యంత అరుదైన విషయం కావడం విశేషం. ఇదే క్రమంలో గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా పవన్ కళ్యాణ్‌కు తాజాగా 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్" అనే విశిష్ట బిరుదు కూడా లభించింది. తన అధునాతన శిక్షణలో భాగంగా, భారతదేశంలో జపాన్ యుద్ధకళలలో అగ్రగణ్యులలో ఒకరైన ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ వద్ద పవన్ కళ్యాణ్ శిక్షణ పొందారు.
Details
అత్యంత ప్రముఖుల్లో ఒకరిగా గుర్తింపు
ఆయన మార్గదర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 'కెండో'లో సమగ్ర శిక్షణను పొందుతూ, ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యంతో పాటు లోతైన తాత్విక అవగాహనను కూడా సంపాదించారు. ఈ మైలురాయి ద్వారా సినిమా రంగం, శాస్త్రీయ యుద్ధకళలు, యుద్ధ తత్వశాస్త్రం—ఈ మూడు విభాగాలను అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్దిమంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.