LOADING...
Harihara Veeramallu: మరోసారి వాయిదా పడిన 'హరిహర వీరమల్లు' .. టీమ్ ప్రకటన
మరోసారి వాయిదా పడిన 'హరిహర వీరమల్లు' .. టీమ్ ప్రకటన

Harihara Veeramallu: మరోసారి వాయిదా పడిన 'హరిహర వీరమల్లు' .. టీమ్ ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న తాజా చిత్రం 'హరిహర వీరమల్లు'. ఈ చిత్రానికి జ్యోతికృష్ణ, క్రిష్‌ దర్శకులుగా వ్యవహరిస్తుండగా, ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 12న విడుదలవుతుందనే ఆశతో ఉన్న అభిమానులకు మళ్లీ నిరాశ ఎదురైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.

వివరాలు 

అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా 

"అచంచలమైన ఓపిక, నమ్మకంతో మాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రియులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.జూన్ 12న సినిమాను విడుదల చేసేందుకు మేము నిరంతరం శ్రమించాం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ తేదీన సినిమాను విడుదల చేయడం సాధ్యపడలేదు. కష్టమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవన్ కల్యాణ్‌ గారి ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఫ్రేమ్‌ను అత్యుత్తమంగా రూపొందించేందుకు విశేషంగా శ్రమిస్తున్నాం. ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభూతి అందించాలన్న లక్ష్యంతో కొంత అదనపు సమయం తీసుకోవాల్సి వస్తోంది. మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాను మీకిచ్చే అద్భుతమైన బహుమతిగా మార్చేందుకు మా ప్రయత్నం కొనసాగుతుంది'' అని పేర్కొన్నారు.

వివరాలు 

రెండు భాగాలుగా 'హరిహర వీరమల్లు' సినిమా 

అలాగే, సోషల్ మీడియా వేదికలపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని, సినిమాకు సంబంధించిన ఏమైనా అధికారిక సమాచారం తామే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడిస్తూ, త్వరలోనే కొత్త విడుదల తేదీ కూడా ప్రకటించనున్నట్లు వివరించారు. ఈ చిత్రం ఒక చారిత్రక యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ కథ మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. సంగీత దర్శకుడిగా ఎం.ఎం. కీరవాణి పనిచేస్తున్నారు. 'హరిహర వీరమల్లు' సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది.