
Pawan Kalyan : అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అరవింద్ తల్లి, చిరంజీవి అత్తయ్య అయిన అల్లు కనకరత్నమ్మ మరణించడంతో అల్లు, మెగా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. అంత్యక్రియల కార్యక్రమాలు పూర్తయ్యే వరకు అల్లు అర్జున్ స్వయంగా ఇంట్లోనే ఉండి అన్ని ఏర్పాట్లను చూసుకున్నారు. నిన్న సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై, ఆమెకు నివాళులు అర్పించడంతో పాటు అల్లు అరవింద్, బన్నీ, రామ్ చరణ్‌లను ఓదార్చారు. అయితే నిన్న విశాఖపట్నంలో జనసేన బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, సభ అనంతరం రాత్రి హైదరాబాద్ చేరుకుని అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ను పరామర్శించారు. కనకరత్నమ్మ ఫోటోకు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు సాంత్వన చెప్పారు.
Details
కుటుంబానికి అండగా నిలవడంతో అభిమానుల్లో సంతోషం
ఈ సందర్భంలో పవన్ - బన్నీతో మాట్లాడుతున్న ఫొటోలు బయటకు రావడంతో అవి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలు విస్తరించాయి. ముఖ్యంగా బన్నీ తన స్నేహితుడైన ఒక వైసీపీ నాయకుడికి సపోర్ట్ చేయడంతో, పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు అతనిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా అల్లు అర్జున్‌ను పరామర్శించి, కుటుంబానికి అండగా నిలవడంతో అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. మరి కనీసం ఇంతటితోనైనా మెగా, బన్నీ అభిమానులు ఒకటే కుటుంబమని అర్ధం చేసుకొని ఫ్యాన్ వార్స్‌ను ఆపుతారా అన్నది చూడాల్సి ఉంది.