Salaar 2: సలార్ 2 లో టన్నెల్ ఫైట్ సీక్వెన్స్.. క్లిప్స్, ఫోటోలు సోషల్ మీడియాలో లీక్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇటీవల "కల్కి 2898 ఏడీ" సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ "స్పిరిట్," "కల్కీ 2," "రాజా సాబ్," "సలార్ 2" వంటి సినిమాలతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో "ఫౌజీ" సినిమాలో కూడా నటిస్తున్నట్టు ప్రకటించారు. "సలార్ 2" షూటింగ్ కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, మిగిలిన ప్రాజెక్టుల విషయంలో ప్రభాస్ పూర్తి ఉత్సాహంతో ఉన్నారు.
"సలార్ 2" ప్రాజెక్ట్ రద్దు అయ్యిందని పుకార్లు
ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన "సలార్" బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ఇటీవల ప్రభాస్, ప్రశాంత్ నీల్ మధ్య విబేధాలు వచ్చాయని, అందుకే "సలార్ 2" ప్రాజెక్ట్ రద్దు అయ్యిందని పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్పందిస్తూ, సెట్లో ప్రభాస్, ప్రశాంత్ నీల్ నవ్వుకుంటున్న ఫోటోను షేర్ చేసి పుకార్లను ఖండించింది.
"సలార్ 2"పై అభిమానుల్లో మరింత ఆసక్తి
"సలార్: పార్ట్ 1: సీజ్ ఫైర్" గత డిసెంబర్లో విడుదలై ప్రభాస్ అభిమానుల్లో ఆనందం నింపింది. దీనితో "శౌర్యంగ పర్వం" పేరుతో రూపొందుతున్న పార్ట్ 2పై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి సంబంధించిన కొంత భాగం ప్రశాంత్ నీల్ ముందే పూర్తి చేశారు, అయితే ఇంకా కొంత షూటింగ్ మిగిలి ఉంది. తాజాగా, "సలార్ 2"లోని టన్నెల్ ఫైట్ సీక్వెన్స్ క్లిప్స్, ఫోటోలు లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి అభిమానులు మరింత ఉత్సాహంతో ఉన్నారు. పార్ట్ 1లోని కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ కంటే ఇది మరింత హింసాత్మకంగా ఉంటుందని టాక్ ఉంది, దీనితో "సలార్ 2"పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.