కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ఆస్కార్ కాదు భాస్కర్ కూడా రాదు - ప్రకాష్ రాజ్
నటుడు ప్రకాష్ రాజు, కశ్మీర్ ఫైల్స్ సినిమాపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. కేరళలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లెటర్స్ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్, అటు పఠాన్ సినిమాను బాయ్ కాట్ చేయాలన్న గ్యాంగ్ ని, ఇటు కశ్మీర్ ఫైల్స్ దర్శకుడిని తీవ్రంగా విమర్శించారు. పఠాన్ సినిమాను బాయ్ కాట్ చేయాలనీ ఒక గ్యాంగ్ బాగా అల్లరి చేసిందనీ, అయినా సినిమా సూపర్ హిట్ అయ్యిందనీ, బాయ్ కాట్ గ్యాంగ్ మొరుగుతుంది తప్ప కరవలేదని అన్నారు. ఇంకా కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడుతూ, అదో చెత్త సినిమా అనీ, ఇంటర్నేషనల్ జ్యూరీ, కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఉమ్మేసిందనీ, అయినా కూడా ఆ సినిమా దర్శకుడు, ఆస్కార్ ఎందుకు రాదని ప్రశ్నిస్తాడని అన్నారు.
2వేల కోట్ల రూపాయలతో కశ్మీర్ ఫైల్స్ నిర్మాణం
కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ఆస్కార్ కాదు కదా భాస్కర్ అవార్డ్ కూడా రాదని, ఇలాంటి సినిమాలు నిర్మించడానికి 2వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసారని ప్రకాష్ రాజ్ అన్నారు. ఇప్పుడే కాదు గతంలోనూ కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేసారు. అప్పుడు కశ్మీర్ ఫైల్స్ సినిమాకు మద్దతు తెలుపుతూ చాలామంది ప్రకాష్ రాజ్ ని విమర్శించారు. ప్రస్తుతం ప్రకాష్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. కశ్మీరీ పండిట్లపై దాడులను ఎందుకు విస్మరించాలని వాళ్ళు ప్రకాష్ రాజ్ ని ప్రశ్నిస్తున్నారు. ప్రకాష్ రాజ్, తన మాటలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో ఏమో!