LOADING...
Pratyusha: ప్రత్యూష మృతి కేసు.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
ప్రత్యూష మృతి కేసు.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

Pratyusha: ప్రత్యూష మృతి కేసు.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరవై ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సినీనటి ప్రత్యూష మరణానికి సంబంధించిన కేసు తుది దశకు చేరుకుంది. ఈ కేసులో,హైకోర్టు విధించిన శిక్షపై నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి చేసిన అప్పీల్‌తో పాటు,ఆ శిక్షను పెంచాలని ప్రత్యూష తల్లి సరోజినీదేవి కోరుతూ వేసిన మరో క్రిమినల్‌ అప్పీల్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్‌ రాజేశ్‌ బిందల్,జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన బెంచ్‌ బుధవారం విచారణ ముగించి తీర్పును రిజర్వ్‌ చేసింది. హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుతున్న కాలంలోనే ప్రత్యూష-సిద్ధార్థరెడ్డి ప్రేమలో పడ్డారు. తర్వాత ప్రత్యూష సినీరంగంలో అడుగుపెట్టగా, సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7.30 నుంచి 8గంటల మధ్య ఇద్దరూ పురుగుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ సేవించిన స్థితిలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

వివరాలు 

ముగ్గురు వైద్యుల బృందం నివేదిక

ప్రత్యూష 24న మృతి చెందగా, చికిత్స పూర్తయ్యాక సిద్ధార్థరెడ్డి మార్చి 9న డిశ్చార్జి అయ్యాడు. ఆర్గానోఫాస్ఫేట్‌ అనే రసాయనమే ప్రత్యూష మరణానికి కారణమని, అంతేకాకుండా ... ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. ఈ నివేదికల ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేసి, సిద్ధార్థరెడ్డిపై ఆత్మహత్యకు ప్రేరేపించడం (306), ఆత్మహత్య ప్రయత్నం (309) నేరాల కింద ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. కేసును విచారించిన హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి 2004 ఫిబ్రవరి 23న ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించారు.

వివరాలు 

శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి పిటిషన్ 

ఆ తీర్పును సవాలు చేస్తూ సిద్ధార్థరెడ్డి హైకోర్టుకు వెళ్లగా, 2011 డిసెంబర్‌ 28న హైకోర్టు జైలుశిక్షను రెండేళ్లకు తగ్గించి, జరిమానాను రూ.50,000కు పెంచింది. ఈ నిర్ణయంపై సిద్ధార్థరెడ్డి, సరోజినీదేవి ఇద్దరూ 2012లో సుప్రీంకోర్టులో ప్రత్యేక అప్పీళ్లు దాఖలు చేశారు. వాదనల్లో, సీబీఐ తరఫున సీనియర్‌ న్యాయవాది నచికేత్‌ జోషి.. కేసులోని సాక్ష్యాలు నిందితుడిపై ఆరోపణలను బలపరుస్తున్నాయని అన్నారు. ప్రత్యూషను ఆత్మహత్య వైపు నెట్టినందుకు 302 సెక్షన్‌ కింద శిక్షించాల్సిన అవసరం ఉందని, అది సాధ్యం కాకపోతే కనీసం 306 కింద గరిష్ఠ శిక్ష విధించాలన్నారు. మరోవైపు, నిందితుడి తరఫున సీనియర్‌ న్యాయవాదులు నాగముత్తు, ఎల్‌.నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరూ కలిసి పురుగుమందు తాగినప్పుడు "ఆత్మహత్యకు ప్రేరేపించాడు" అనే అభియోగం సహజంగానే నిలబెట్టుకోలేమని వాదించారు.