
Rajamouli: అభిమాని మీద రాజమౌళి అసహనం.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి పాన్ గ్లోబల్ స్థాయిలో రూపొందుతోన్న భారీ చిత్రంపై పూర్తి దృష్టి సారించారు. అయితే ప్రస్తుతం ఓ అభిమాని మీద రాజమౌళి కోపం చూపిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన 2025 జూలై 13న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. అదే రోజున ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని తిలకించి, నివాళులర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమాతో కలిసి కోట శ్రీనివాసరావు నివాసానికి వచ్చారు.
Details
ఇలాంటి సందర్భాల్లో సెల్ఫీ కోరడం అసభ్యం
నివాళులు అర్పించిన అనంతరం వారు తిరిగి వెళ్తుండగా ఓ అభిమాని సెల్ఫీ కోసం రాజమౌళిని వెంటాడాడు. మొదట సహనంగా స్పందించిన రాజమౌళి, అభిమాని కారు వరకూ పరిగెత్తుతూ వచ్చి మళ్లీ సెల్ఫీ కోసమే విసిగించడంతో అసహనం వ్యక్తం చేశారు. అతడి ప్రవర్తనపై కోపం వ్యక్తం చేసిన రాజమౌళి ఆ అభిమాని తలను పక్కకు నెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రాజమౌళికి మద్దతు ఇస్తున్నారు. 'ఇలాంటి సున్నిత సందర్భాల్లో సెల్ఫీ కోరడం అసభ్యం' అని వారు అభిప్రాయపడుతున్నారు.
Details
కథానాయికగా ప్రియాంక చోప్రా
ఓ ప్రముఖ వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఇలా సెల్ఫీల కోసం వెంటపడటం సరికాదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. సమయం, సందర్భం ఏమిటో తెలుసుకోకుండా, అభిమానులంతా ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, రాజమౌళి - మహేష్ బాబు కలయికలో వస్తున్న కొత్త చిత్రం పట్ల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కథాంశం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంతో సాగనుందని సమాచారం. ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని పాన్-గ్లోబల్ స్థాయిలో రూపొందించేందుకు జక్కన్న టీమ్ శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది.