వచ్చే సంక్రాంతికి ప్రభాస్, రజనీ కాంత్ పోటాపోటీ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్, స్పిరిట్ మొదలగు సినిమాలున్నాయి. అందుకే ప్రభాస్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం జూన్ నుండి ప్రభాస్ సినిమాలు ఒక్కోటి విడుదల కానున్నాయి. జూన్ లో ఆదిపురుష్ రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ లో సలార్ రెడీగా ఉంది. ఇక 2024 సంక్రాంతి సందర్భంగా ప్రాజెక్ట్ కె సిద్ధమవుతోంది. ఇక్కడే ఓ చిక్కొచ్చి పడినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. ప్రభాస్ కి పోటీగా చాలా సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ లైన్ లో రజనీ కాంత్ మూవీ చేరిపోయిందని వినిపిస్తోంది.
తలైవర్ 170 మూవీతో వస్తున్న రజనీ కాంత్
ఇటీవల రజనీకాంత్ 170వ సినిమా ప్రకటన వెలువడింది. జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవర్ 170వ మూవీ ఉంటుందనీ, లైకా ప్రొడక్షన్ బ్యానర్ నిర్మాణంలో తెరకెక్కుతుందని అనౌన్స్ మెంట్ వచ్చింది. తలైవర్ 170 మూవీని సంక్రాంతికి తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు మరికొద్ది రోజుల్లో అధికారికంగా వెల్లడి చేయనున్నారని చెప్పుకుంటున్నారు. తలైవర్ 170 మూవీ, సంక్రాంతికి రిలీజైతే బాక్సాఫీసు వద్ద ప్రభాస్ కి, రజానీకాంత్ కి మధ్య పోటాపోటీగా ఉంటుంది. రెండూ పెద్ద సినిమాలే కావడంతో పోటీ ఉంటుంది. మరేం జరుగుతుందో చూడాలి. తలైవర్ 170 కంటే ముందు జైలర్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు రజనీ కాంత్. 2023 ఏప్రిల్ 14వ తేదీన జైలర్ విడుదల అవుతుంది.