Happy birthday,Rana Daggubati: హ్యాపీ బర్త్ డే రానా..పాత్ర ఏదైనా ఒదిగిపోవడం 'రానా నాయుడి' స్టైల్
టాలీవుడ్ సినీపరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ నటీనటుల కోవకు చెందిన హీరో రానా దగ్గుబాటి. నిర్మాతలుగా, ప్రొడక్షన్ మేనేజర్'గా మారి మంచి కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తుంటారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు కృషి చేసే నటుల్లో రానా ఒకరు.డిసెంబర్ 14న రానా 39వ ఏటలో అడుగుపెడుతున్నాడు. హీరో ట్యాగ్ వద్దు, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే చాలని, హీరో పాత్రలు మాత్రమే చేయాల్సిన అవసరం లేదని భావించే హీరో రానా. కథనాయకుడిగా రానా చివరి చిత్రం 'విరాటపర్వం' బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌ను సాధించలేకపోయింది. కానీ రానా పాత్రకు ప్రేక్షకులంతా జై కొట్టారు. ఇదే సమయంలో 'రానా నాయుడు'తో ఓటిటి ప్రపంచంలోకి బాబాయ్ వెంకటేష్'తో కలిసి అడుగుపెట్టాడు.
లీడర్ సినిమాతో తెరంగేట్రం
మరోవైపు ఒకే ఏడాదిలో రెండు సినిమాలకు ప్రజెంటర్‌గా పనిచేశారు. ఇక కంటెంట్ ఉందనిపిస్తే.. నిర్మాతగా, ప్రజెంటర్‌గా వ్యవహరించేందుకు వెనకాడనితత్వం రానా. 2023లో ముందుగా తిరువీర్ హీరోగా నటించిన విలేజ్ కామెడీ డ్రామా 'పరేషాన్'ను ప్రజెంట్ చేశాడు. తాజాగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కీడా కోలా'తో మరోసారి ప్రజెంటర్ అయ్యాడు. సినిమాలో ఎంట్రీ ఇచ్చేముందే విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్‌గా ఉన్న రానా నంది అవార్డ్‌ను గెల్చుకున్నాడు. 2010లో 'లీడర్' సినిమాతో తెరంగేట్రం చేసి సీఎం పాత్రతో సినీ ప్రేక్షకులను అలరించాడు. కెరీర్ మొదటి నుండే కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండేవాడు రానా.
ఆ మూవీస్'లోనూ సపోర్టింగ్ రోల్..
నటుడిగా రానా కెరీర్‌కు కొత్త ఊపునిచ్చింది 'బాహుబలి'.హీరోగా నిలదొక్కుకున్నా విలన్‌గా చేసేందుకు సిద్ధమయ్యాడు. బల్లాలదేవుడిగా బాహుబలిని ఢీకొట్టే కటౌట్‌గా నిలిచాడు. 'విరాటపర్వం', 'రుద్రమదేవి'లాంటి మహిళా కథాంశం సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేయడంలో రానా ముందుంటాడు. ప్రస్తుతం ఓటిటి కంటెంట్ అనేది ట్రెండింగ్ అవుతోంది. దీంతో 'రానా నాయుడు' వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్'పై తన బాబాయ్ వెంకటేష్'తో కలిసి నటించాడు. ఇందులో రానా, వెంకటేష్ తండ్రి కొడుకులుగా డెలాగులతో చేసిన కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వెండితెరపై హీరోగా తన తరువాతి ప్రాజెక్టుపై రానా క్లారిటీ ఇవ్వలేదు కానీ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం 'వెట్టాయన్'లో దగ్గుబాటి రానా కీలక పాత్రలో నటిస్తుండటం గమనార్హం.