LOADING...
Vijay-Rashmika: రీల్‌ లవ్‌ నుంచి రియల్‌ మ్యారేజ్‌ వరకు.. ఇది విరోష్‌ కథ..
రీల్‌ లవ్‌ నుంచి రియల్‌ మ్యారేజ్‌ వరకు.. ఇది విరోష్‌ కథ..

Vijay-Rashmika: రీల్‌ లవ్‌ నుంచి రియల్‌ మ్యారేజ్‌ వరకు.. ఇది విరోష్‌ కథ..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకరు పద్ధతైన 'గీత'.. మరొకరు అల్లరి 'గోవిందం'.. అలా మొదలైన వీరి ప్రయాణం.. ఒకరి కోసం ఒకరు నిలబడే 'డియర్‌ కామ్రేడ్స్'గా మారింది. 'ఇంకేం ఇంకేం కావాలే' అనిపించే ఈ జంట, "ఈ రౌడీ నీతోనే ఉంటాడు" అన్న మాటను నిజం చేసే దశకు వచ్చింది. అభిమానుల హృదయాల్లో నేషనల్‌ క్రష్‌గా నిలిచిన ఆమె, ఇప్పుడు విజయ్‌ ఇంటి మహాలక్ష్మిగా మారబోతోంది. తెరపై మెరిసిన జంటగా మొదలైన బంధం, నిజ జీవితంలో వివాహంగా రూపాంతరం చెందుతోంది. పుకార్లకు తెరదించుతూ తమ అనుబంధాన్ని అధికారికంగా ప్రకటించి, పెళ్లి కార్డుతో శుభవార్త పంచుకున్నారు. ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా, వారి ప్రేమ ప్రయాణాన్ని ఓసారి చూద్దాం..!

వివరాలు 

ఈ సినిమా ఇద్దరికీ మైలురాయి

'గీత గోవిందం' ద్వారా తొలిసారిగా వెండితెరపై జంటగా కనిపించిన వీరు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ఆ పరిచయం 'డియర్‌ కామ్రేడ్‌' సమయానికి మరింత గాఢమైన అనుబంధంగా మారింది. అందుకే ఈ చిత్రాలు తమకు ఎంతో ప్రత్యేకమని వారు పలుమార్లు వెల్లడించారు. ఆ కథల్లోని ప్రేమ, ఆత్మీయత, పోరాట భావం వారి వ్యక్తిగత జీవితానికీ ప్రతిబింబంలా నిలిచింది. కష్టసమయాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచిన సందర్భాలు వారిని మరింత దగ్గర చేశాయి. అభిమానులు కూడా ఈ జంటను ఆదరించడంతో, ఆ అనుబంధం చివరికి వివాహ బంధంగా మారింది. తమ ప్రేమకు ఆరంభం ఆ చిత్రాల ద్వారానేనని వారు చిరునవ్వుతో తెలియజేస్తుంటారు.

వివరాలు 

అలా మొదలై.. ఇలా కన్ఫామ్‌ చేసి..

వేదికలపై, సోషల్‌ మీడియా ద్వారా ఇద్దరూ తమ అనుబంధాన్ని సూచిస్తూ వచ్చారు. పరస్పరంగా ఒకరి గురించి మరొకరు చెప్పిన మాటలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. చివరికి ఫిబ్రవరి 22న తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి, 'విరోష్‌' అంటూ ప్రేమ ముద్ర వేశారు.

Advertisement

వివరాలు 

మూడు ముళ్ల బంధానికి మూడు మెట్లు..

'డియర్‌ కామ్రేడ్‌' ప్రచార సమయంలో రష్మిక,విజయ్‌ గురించి మాట్లాడుతూ ఆయన నిజాయితీని ప్రశంసిస్తూ "మేము మంచి స్నేహితులమే" అని చెప్పింది. విజయ్‌ కూడా అదే భావాన్ని వ్యక్తం చేస్తూ మొదటి మెట్టుపై అడుగుపెట్టాడు. 'పుష్ప' ప్రమోషన్స్‌లో రష్మిక ఆయనను తనకు అత్యంత సన్నిహిత స్నేహితుడిగా పేర్కొంది. అనంతరం 'కాఫీ విత్‌ కరణ్‌' కార్యక్రమంలో విజయ్‌, రష్మికపై తన అభిమానాన్ని స్పష్టంగా వ్యక్తం చేసి వారి అనుబంధాన్ని మరో మెట్టెక్కించాడు. 'ది గర్ల్‌ ఫ్రెండ్‌' ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్‌, అందరి ముందూ రష్మిక చేతిని ముద్దాడడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఆ సందర్భం వారి సంబంధాన్ని మరింత బలపరిచింది. అలా మూడు దశలు దాటి, మూడు ముళ్ల బంధానికి వారు చేరువయ్యారు.

Advertisement

వివరాలు 

ఒకరికొకరు తోడుగా..

రష్మికకు సంబంధించిన డీప్‌ ఫేక్‌ వీడియో వివాదం వెలుగులోకి వచ్చినప్పుడు, విజయ్‌ ఆమెకు బలంగా మద్దతు తెలిపాడు. ఇలాంటి ఘటనలు ఎవరికీ జరగకూడదని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. పలు సందర్భాల్లో ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ, అన్ని విజయాలకు ఆమె అర్హురాలని అభినందించాడు. సినిమా విజయాలు, అపజయాల సందర్భాల్లోనూ వారు ఒకరికొకరు అండగా నిలిచారు. 'కింగ్డమ్‌' చిత్రం విజయ్‌ కెరీర్‌కు కొత్త ఉత్సాహం నింపగా,రష్మిక ఆనందాన్ని పంచుకుంది. ఆనంద్‌ దేవరకొండ చిత్రాలకు కూడా ప్రమోషన్స్‌లో పాల్గొని, విజయ్‌ కుటుంబానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపింది.

వివరాలు 

కుటుంబంతో అనుబంధం

విజయ్‌ తల్లి మాధవితో రష్మికకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆమె గురించి రష్మిక ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. విజయ్‌ మనసును గెలుచుకున్న ఆమె, కుటుంబ సభ్యుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ ఇంటి కోడలిగా అడుగుపెట్టబోతోంది.

Advertisement