Manchu Mohanbabu: హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట.. పోలీసు విచారణ నుంచి మినహాయింపు
తెలంగాణ హైకోర్టు మోహన్ బాబుకు ఊరట కల్పించింది. మంచు కుటుంబ వివాదంలో మోహన్ బాబుపై పోలీసుల విచారణకు హాజరయ్యే విధంగా రాచకొండ సీపీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోహన్ బాబు, మీడియాపై దాడికి సంబంధించి కేసు నమోదవడంతో హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మోహన్ బాబుకు, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఊరట ఇచ్చింది. పోలీసుల విచారణ నుంచి మినహాయింపు ఇవ్వటంతో పాటు, ఈ పిటిషన్ పై తదుపరి విచారణ ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.
త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయి
ఇక మంచు మనోజ్, మోహన్ బాబు పరస్పరం కేసులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు రాత్రి మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తెలిపిన వివరాలు, విపరీతమైన ఒళ్లు నొప్పులు, గాయాలు, రక్తపోటు పెరుగుదలతో ఆసుపత్రికి చేరుకున్నారని వెల్లడించారు. మంచు విష్ణు ఈ వివాదంపై స్పందించారు. ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయని, త్వరలోనే పరిష్కారమవుతాయని తెలిపారు. తన నాన్న మీద దుష్ప్రచారం చేయవద్దని, మా విషయంలో కొన్ని మీడియా ఛానాళ్లు గీతలు దాటి ప్రవర్తిస్తున్నాయని పేర్కొన్నారు.