Renukaswamy murder case: కన్నడ సినీ నటుడు దర్శన్, పవిత్ర గౌడకు బెయిల్ మంజూరు
కర్ణాటక హైకోర్టు, అభిమాని హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్, అతని స్నేహితురాలు పవిత్ర గౌడకు బెయిల్ మంజూరు చేసింది. సినీఫక్కీలో హత్య 2024 జూన్ 9న జరిగిన ఈ హత్య సంఘటన కన్నడ చిత్రసీమలో సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం, దర్శన్ తన స్నేహితురాలు పవిత్ర గౌడ్‌తో కలిసి రేణుకాస్వామి అనే తన వీరాభిమాని హత్య చేశాడు. ఈ ఘటన అనంతరం రేణుకాస్వామి మృతదేహాన్ని బెంగళూరు కామాక్షిపాల్యలోని ఒక మురికికాల్వలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, దర్శన్ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కేసు నమోదు చేశారు.
హత్యకు కారణమిదే!
పోలీసుల వివరాల ప్రకారం, దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటూ, పవిత్ర గౌడతో సహజీవనం చేస్తుండటమే ఈ హత్యకు దారితీసింది. పవిత్ర గౌడ్ సోషల్ మీడియాలో దర్శన్‌తో కలిసి ఉన్న ఫోటోలు పోస్టు చేయగా, వీటిపై రేణుకాస్వామి అసభ్యకర కామెంట్లు చేశాడు. అలాగే, దర్శన్‌పై విమర్శిస్తూ, పవిత్రను విడిచిపెట్టి వెళ్లిపోవాలంటూ తరచూ పోస్టులు పెట్టాడు. ఈ వ్యాఖ్యలు పవిత్రను తీవ్రంగా బాధించగా, ఈ విషయాన్ని ఆమె దర్శన్ దృష్టికి తీసుకెళ్లింది. ఆగ్రహించిన దర్శన్, తన అనుచరులతో కలిసి రేణుకాస్వామిని బెంగళూరుకు బలవంతంగా తీసుకువచ్చాడు. ఓ గోదాములో రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి, ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చి, ఇనుపరాడ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం అతని శవాన్ని మురికికాల్వలో పడేశారు.
జైలులో రాచమర్యాదలు
హత్య కేసులో ప్రధాన నిందితులుగా దర్శన్, పవిత్ర గౌడ్‌లను అరెస్టు చేసిన పోలీసులు, వారికి జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని ఆరోపణలు వచ్చాయి. దర్శన్ జైల్లో తన మిత్రులతో కలిసి సిగరెట్ తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బెంగళూరు న్యాయస్థానం ఆయనను బళ్లారి జైలుకు తరలించేందుకు ఆదేశించింది. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉన్నారు. తాజాగా కర్ణాటక హైకోర్టు ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది.