
Robo Shankar: అనారోగ్యంతో ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ సినీ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ కన్నుమూశారని సినీ వర్గాలు ధృవీకరించాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, సెప్టెంబర్ 18న తుదిశ్వాస విడిచారు. వయసు 46 సంవత్సరాలు. గత కొన్ని నెలలుగా కామెర్లు సమస్యతో బాధపడుతున్న రోబో శంకర్, ఇటీవల ఓ సినిమా షూటింగ్ సమయంలో ఆకస్మికంగా స్పృహ తప్పి కుప్పకూలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో వైద్యులు చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి మరింత విషమించి ఆయన మరణించారు. రోబో శంకర్ "హే", "దీపావళి" సినిమాలతో ఆరంభమైంది. తనదైన కామెడీ టైమింగ్, యాక్షన్‌తో కూడిన హాస్య శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
వివరాలు
రోబో శంకర్ మృతిపై కమల్ హాసన్ ఎమోషనల్ నివాళి
ముఖ్యంగా ధనుష్ హీరోగా నటించిన "మారి"సినిమా ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అనంతరం అజిత్‌తో కలిసి నటించిన "విశ్వాసం",శివకార్తికేయన్‌తో నటించిన "వేలైక్కారన్"వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. రోబో శంకర్ మరణవార్తపై సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నటుడు కమల్ హాసన్ భావోద్వేగంతో స్పందిస్తూ.. "రోబో శంకర్ అనేది ఒక పేరు మాత్రమే. కానీ నాకు నువ్వు తమ్ముడివి. నన్ను వదిలి ఇలా ఎలా వెళ్ళిపోతావు? నీ ప్రయాణం పూర్తయింది, కానీ నా పని ఇంకా మిగిలే ఉంది" అంటూ హృదయపూర్వక నివాళి అర్పించారు. ప్రస్తుతం రోబో శంకర్ మృతదేహాన్ని చెన్నైలోని వలసరవక్కలో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.