Nagarjuna Birthday: టాలీవుడ్ మన్మథుడు నాగార్జున పుట్టినరోజు స్పెషల్..
ఓ హీరో.. 30 ఏళ్ల వయసులో రొమాన్స్ చేస్తే ఓకే.. కానీ 60 ఏళ్ల వయసులో రొమాన్స్ చేయడం అంటే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది.కానీ ఈ ప్రత్యేకతను చూపించిన హీరో ఎవరో తెలుసా? అది నాగార్జున! పేరుకే నటుడు కానీ, రొమాన్స్‌లో మాత్రం'కింగ్'అన్నట్టు.తెలుగు హీరోలు ఎంతమందైనా ఉండొచ్చు కానీ వాళ్లందరితో పోలిస్తే నాగార్జున స్పెషల్ ఎందుకో తెలుసా? టాలీవుడ్‌లో అక్కినేని నాగేశ్వరరావు అలియాస్ ANR ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నారు. ఆయన వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన నాగార్జున, తన కెరీర్ ప్రారంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. ఆయన రూపం హీరోగా పనికిరాదని,వాయిస్ కూడా బాగోలేదు అనే విమర్శలు వచ్చాయి.కానీ, కొన్ని సినిమాలతో ఈ విమర్శలను నెగ్లిజ్ చేసి, తన యాక్టింగ్‌తో ప్రతిభను చూపించాడు.
విభిన్నమైన జానర్స్‌లో సినిమా చేసిన ఏకైక హీరో
చాలా హీరోలు ఒకటి రెండు జానర్స్‌లో మాత్రమే పరిమితమై పోతారు. కానీ నాగార్జున మాత్రం విభిన్నమైన జానర్స్‌లో పనిచేశారు. మొదట 'మజ్ను' వంటి ట్రాజెడీ సినిమాలు,తరువాత 'గీతాంజలి' వంటి ప్రేమ కథలు,'శివ' వంటి ట్రెండ్ సెటింగ్ యాక్షన్ మూవీస్, 'అన్నమయ్య','శ్రీరామదాసు' వంటి భక్తి చిత్రాలతో విభిన్న జానర్స్‌లో పని చేసి, ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. చాలామంది హీరోలకి వయసుతో పాటు రొమాంటిక్ సీన్స్ తగ్గిస్తారు. కానీ నాగార్జున మాత్రం తన వయసుతో సంబంధం లేకుండా రొమాన్స్ చేస్తారు. 'ఘోస్ట్' సినిమాలో, సోనాల్ చౌహాన్‌తో లిప్ లాక్ సన్నివేశాల్లోనూ నటించి ఈ వయస్సులోనూ 'మన్మథుడు' అనిపించాడు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్‌లోనూ తన ఫ్లర్టింగ్ స్కిల్స్‌ను చూపిస్తుంటారు.
తెలుగులో బెస్ట్ మల్టీస్టారర్ చిత్రాల్లో ఒకటిగా 'మనం'
'మనం' సినిమాతో నాగార్జునకు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పవచ్చు. తండ్రి, కొడుకులతో కలిసి నటించిన సినిమా ఇది. ఇందులో తండ్రి ఏఎన్నార్, కొడుకులు నాగచైతన్య, అఖిల్ నటించారు. ఈ చిత్రం తెలుగులో బెస్ట్ మల్టీస్టారర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే, తండ్రి సినిమాల్లో నటించిన హీరోయిన్లతో కూడా నాగార్జున సినిమాలు చేశాడు.ప్రస్తుతం పాన్ ఇండియా అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ హడావుడి చేస్తోంది కానీ, అప్పట్లోనే నాగార్జున హిందీ సినిమాల్లో నటించాడు. మహేశ్ భట్‌తో 'క్రిమినల్', మణిరత్నంతో 'గీతాంజలి' సినిమాలు చేశాడు.
బుల్లితెరపై కూడా సక్సెస్
చాలా మంది హీరోలు బిగ్ స్క్రీన్ పై సక్సెస్ అయ్యి, బుల్లితెరపై ఫెయిల్ అయ్యిన వారు ఉన్నారు. కానీ నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు', 'బిగ్‌బాస్' వంటి షోలను హోస్ట్ చేస్తూ విజయం సాధించాడు. బిగ్ బాస్ మూడో సీజన్ నుంచి ఈ షోకి హోస్టింగ్ చేస్తున్న నాగార్జున, త్వరలో ఎనిమిదో సీజన్‌తో సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయిపోతున్నాడు. చిరు, ఎన్టీఆర్ వంటి వారు బుల్లితెరపై ప్రయత్నించినప్పటికీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు. కానీ , నాగార్జున మాత్రం ప్రతి ఇంటికీ చేరువైపోయాడు. తెలుగులో ఎన్నో రికార్డులు సాధించిన నాగార్జున, మరెన్నో బర్త్‌డేలు జరుపుకోవాలని ఆశిస్తూ, 'పుట్టినరోజు శుభాకాంక్షలు' తెలుపుతోంది తెలుగు న్యూస్ బైట్స్.