జపాన్ లో ఆర్ఆర్ఆర్ హవా: వన్ బిలియన్ మార్క్ దిశగా అడుగులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్ఆర్ఆర్ సినిమా అస్సలు తగ్గట్లేదు. సినిమా రిలీజై సంవత్సరం దగ్గర పడుతున్నా దాని రికార్డుల వేట మాత్రం ఆగట్లేదు. మరీ ముఖ్యంగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ దూకుడు చాలా ఎక్కువగా ఉంది.
2022 అక్టోబర్ నెలలో జపాన్ థియేటర్లలో విడుదలైన ఆర్ఆర్ఆర్, ఇప్పటికీ జపాన్ వాసులను మెప్పిస్తూనే ఉంది. జపాన్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన రజనీకాంత్ ముత్తు (400 మిలియన్ల యెన్) రికార్డును ఎప్పుడో బద్దలు కొట్టేసింది.
తాజాగా వన్ బిలియన్ యెన్ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలవనుంది. ఇప్పటివరకు 950 మిలియన్ల యెన్ వసూళ్ళు సాధించి, వన్ బిలియన్ మార్క్ వైపు దూసుకుపోతుంది.
దీంతో జపాన్ గడ్డపై వన్ బిలియన్ మార్క్ అందుకున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలవనుంది.
ఆర్ఆర్ఆర్
ఆస్కార్ లాంచియోన్ కార్యక్రమానికి హాజరైన చంద్రబోస్, కీరవాణి
రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్, ఇతర దేశాల జనాలను ఊపేస్తుంది. ఇటు అమెరికా వాళ్ళయితే ఆర్ఆర్ఆర్ మూవీని ఒరిజినల్ లాంగ్వేజ్ లో వేసుకుని మరీ చూస్తున్నారు.
హాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రశంసలు కురిపించారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్, డేనియల్ క్వాన్, రుస్సో బ్రదర్స్ మొదలగు హాలీవుడ్ దర్శకులు ఆర్ఆర్ఆర్ మూవీని, రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు.
ప్రస్తుతం ఉత్తమ పాట విభాగంలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట, ఆస్కార్ నామినేషన్లో నిలిచింది. అందువల్ల ఆస్కార్ లాంచియోన్ కార్యక్రమం కోసం చంద్రబోస్, కీరవాణి.. అమెరికా వెళ్లారు.
ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం మార్చ్ 13వ తేదీన లాస్ ఏంజిల్స్ లోని బేవ్రీ హిల్స్ లో ఉండనుంది.