ఆర్ఆర్ఆర్: 10వేల మందితో ఫైట్ చేసినా చిన్న గాయం కూడా కాలేదంటున్న రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ మేనియా ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించట్లేదు. సినిమా విడుదలై 11నెలలవుతున్నా ఆర్ఆర్ఆర్ గురించి ఏదో ఒక డిస్కషన్ రోజూ వస్తూనే ఉంది. హాలీవుడ్ జనాలను అమితంగా ఆకర్షించిన ఆర్ఆర్ఆర్, ఆస్కార్ రేసులో ఉత్తమ పాట విభాగంలో నామినేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. మార్చ్ 13వ తేదీన అమెరికాలో లాంస్ ఏంజిల్స్ లో జరిగే ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి హాజరు కావడానికి ఆర్ఆర్ఆర్ టీమ్ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడిన రామ్ చరణ్, ఇంట్రో ఫైట్ సీక్వెన్స్ గురించి చెప్పుకొచ్చాడు. ఇంట్రో సీక్వెన్స్ లో 10వేల మందిలో ఏ ఒక్కరికీ చిన్న గాయం కూడా కాలేదని చెప్పుకొచ్చాడు. దానికి కారణం 30-40రోజుల ప్రాక్టీస్ అని అన్నాడు.
నాటు నాటు పాట కోసం మూడు నెలల గ్యాప్
ప్రతీదీ పక్కాగా ప్లాన్ చేసుకుని, ప్రాక్టీస్ చేసిన తర్వాతే షూటింగ్ కి వెళ్ళామని, అందువల్లే ఆ సీన్ అంత బాగా వచ్చిందనీ, అందులో ఉన్న ఏ ఒక్కరికీ చిన్నగాయం కూడా కాలేదని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. కాకపోతే నాటు నాటు పాట షూటింగ్ కి ముందు మోకాలికి గాయమైందనీ, దానివల్ల మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందనీ, ఆ తర్వాత నాటు నాటు పాట షూట్ చేసామని అన్నాడు. ఇంకా ఇంటర్వెల్ సమయంలో వచ్చే సీన్ గురించి చెబుతూ, 65రాత్రులు షూట్ చేసామని, 30రోజులు షూట్ చేసిన తర్వాత కరోనా వచ్చిందని, దాంతో అక్కడే ఆపేసి, మళ్ళీ పూర్తిగా కరోనా తగ్గాక మరో 30రోజులు చిత్రీకరించామని అన్నారు.