ఆస్కార్ నామినేషన్లు: రెండు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ కు ఖచ్చితంగా నామినేషన్లు ఉండే అవకాశం?
రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై, పది నెలలు అవుతున్నా కూడా ఆ ఫీవర్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. వరుసగా అంతర్జాతీయ అవార్డులు అందుకుంటూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అభిమానులతో పాటు సినీ అభిమానులంతా ఈరోజు రాత్రి కోసం ఎదురుచూస్తున్నారు. ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన సినిమాలను ఈరోజు రాత్రి ప్రకటిస్తున్నారు కాబట్టి ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది. పశ్చిమ దేశాలను బాగా ఆకట్టుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏదో ఒక విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కుతుందని అందరూ అనుకుంటున్నారు. తాజాగా అమెరికాకు చెందిన పలు పత్రికలు కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ నామినేషన్స్ దక్కుతాయని, రెండు విభాగాల్లో నామినేషన్లు పొందేలా ఉందని జోస్యం చెబుతున్నాయి.
ఉత్తమపాట విభాగంలో, ఉత్తమ నటుడు విభాగంలో నామినేట్ అయ్యే అవకాశం
వెరైటీ, యుఎస్ఏ టుడే లాంటి అమెరికా సంస్థలు ఆస్కార్ కు ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతూ, ఏయే విభాగాల్లో ఎక్కువ శాతం ఛాన్స్ ఉందో చెబుతున్నాయి. ఉత్తమ పాట విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అందుకున్న నాటు నాటు పాట, ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశం ఉందని, అలాగే ఉత్తమ నటుడు విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ నామినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతోంది. వీటిల్లో ఏది నిజమో తెలియాలంటే ఈరోజు రాత్రి 7గంటల వరకు ఆగాల్సిందే. ఆస్కార్ నామినేషన్స్ జనవరి 17వ తేదీన క్లోజ్ అయ్యాయి. ఈరోజు నామినేషన్స్ విడుదల చేస్తారు. 13 మార్చ్ 2023వ తేదీన ఆస్కార్ అవార్డుల ప్రకటన, ప్రదానం ఉంటుంది.