LOADING...
Rukmini Vasanth: ఏఐ డీప్‌ఫేక్ వేధింపుల కేసు.. నటి రుక్మిణి వసంత్ ఫిర్యాదులో ముగ్గురు అరెస్ట్
ఏఐ డీప్‌ఫేక్ వేధింపుల కేసు.. నటి రుక్మిణి వసంత్ ఫిర్యాదులో ముగ్గురు అరెస్ట్

Rukmini Vasanth: ఏఐ డీప్‌ఫేక్ వేధింపుల కేసు.. నటి రుక్మిణి వసంత్ ఫిర్యాదులో ముగ్గురు అరెస్ట్

వ్రాసిన వారు Moogati Shabari
Jun 20, 2026
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

'కాంతార చాప్టర్ 1' సినిమాతో గుర్తింపు పొందిన నటి రుక్మిణి వసంత్‌కు సంబంధించిన డీప్‌ఫేక్ కేసులో కర్ణాటక సైబర్ క్రైమ్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను దుర్వినియోగం చేసి నటి పేరుతో అసభ్యకర చిత్రాలు, వీడియోలను తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారనే ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, అరెస్టైన నిందితులు బాగల్‌కోట్ జిల్లాకు చెందిన రవికుమార్ (24), బెంగళూరులోని కామాక్షిపాళ్యకు చెందిన చంద్రకాంత్ (33), నాగసంద్రకు చెందిన రంజిత్ (25). వీరిపై సమాచార సాంకేతిక (ఐటీ) చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు.

వివరాలు

ఫేక్ ఫోటోలు వైరల్..

ఈ ఏడాది మే నెలలో రుక్మిణి వసంత్ బికినీ ధరించినట్లు కనిపించేలా ఏఐ సాంకేతికతతో రూపొందించిన నకిలీ చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. తన ముఖాన్ని మరో వ్యక్తి శరీరానికి జతచేసి, తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాలను రూపొందించారని పేర్కొంటూ నటి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఇలాంటి తప్పుడు కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

వివరాలు

29 ఖాతాలపై ఎఫ్ఐఆర్ నమోదు..

ఫిర్యాదు అనంతరం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఈ డీప్‌ఫేక్ కంటెంట్‌ను ప్రచారం చేసిన 29 సోషల్ మీడియా ఖాతాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా తాజాగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు విచారణను ముందుకు తీసుకెళ్లారు. ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ నకిలీ, అసభ్యకర కంటెంట్ సృష్టించి ప్రచారం చేసే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, డీప్‌ఫేక్‌ల వల్ల వ్యక్తిగత గోప్యత, ప్రతిష్ఠకు ముప్పు ఏర్పడుతోందన్న ఆందోళనలు మరోసారి వ్యక్తమవుతున్నాయి.

Advertisement