
Salman Khan: సల్మాన్ ఖాన్ కారుని పేల్చేస్తాం.. ఒక్కసారిగా ఉలిక్కపడ్డ బాలీవుడ్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి తీవ్ర బెదిరింపులకు గురయ్యారు.
తాజా ఘటనలో ముంబై రవాణా శాఖ వాట్సాప్ నంబర్‌కు వచ్చిన మెసేజ్‌లో అతని కారు పేల్చేస్తామని, ఇంట్లోకి చొరబడి హతమార్చుతామని హెచ్చరించారు.
ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో వర్లీ పోలీస్ స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించారు.
ఇది సల్మాన్ ఖాన్‌కి ఎదురైన మొదటి బెదిరింపు కాదు. గతంలో కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తరచూ అతడిని టార్గెట్ చేస్తూ బెదిరింపులు చేసింది. సల్మాన్‌పై రేకీ కూడా నిర్వహించిన సందర్భాలున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం అతనికి అదనపు భద్రతను ఏర్పాటు చేసింది.
Details
బిష్ణోయ్ గ్యాంగ్ కు టార్గెట్ గా సల్మాన్ ఖాన్
ఈ బెదిరింపులకు కారణం 1998లో జరిగిన కృష్ణ జింకల వేట కేసు, సల్మాన్ ఖాన్ ఇందులో ప్రధాన నిందితుడిగా ఉండటంతో బిష్ణోయ్ కమ్యూనిటీ, తమకు ఆరాధ్యమైన జంతువును చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది.
2024లో ఈ వ్యవహారం మరింత తీవ్రతరమవగా, బిష్ణోయ్ గ్యాంగ్ ఆయనకు రూ.5 కోట్లు చెల్లించాలంటూ లేదా ఆలయంలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది.
అదే సంవత్సరంలో నకిలీ ఐడీ కార్డులతో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సల్మాన్ ఖాన్ పన్వేల్ ఫామ్ హౌస్‌లోకి చొరబడేందుకు యత్నించారు.
Details
అనేకమార్లు బెదిరింపులు
అలాగే, అక్టోబర్ 30న మరోసారి గుర్తు తెలియని వ్యక్తి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరించాడు.
ఈ వరుస బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ అనేక మార్లు భద్రతను పెంచుకున్నాడు.
ఇటీవల ముంబైలో జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో స్పందించిన సల్మాన్, "దేవుడు, అల్లా చూస్తున్నారు. విధి అనుమతించినంత వరకు నా జీవితం సాగుతుంది" అంటూ తన స్థిరమైన మనోధైర్యాన్ని చూపించారు.