Sandeep Reddy Vanga: సత్యదేవ్ నటన అద్భుతం.. 'రావు బహదూర్'పై సందీప్ రెడ్డి వంగా స్పందన వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా విడుదలైన 'రావు బహదూర్' చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. సినిమా చూసిన అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. సినిమా అంటే ఎందుకు ఇష్టమో మరోసారి గుర్తు చేసే అరుదైన చిత్రాల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. సినీ అభిమానులందరికీ తన తరఫున ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ.. జీవితంలో మూడు గంటల సమయాన్ని 'రావు బహదూర్' సినిమాకు కేటాయించాలని సూచించారు. ఆ సమయం వృథా కాదని, సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. ఈ చిత్రం అందుకుంటున్న ప్రతి ప్రశంసకు పూర్తిగా అర్హత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
అదే ఈ సినిమాకు ప్రధాన బలం: సందీప్
దర్శకుడు వెంకటేశ్ మహా పరిమిత బడ్జెట్‌లోనే అద్భుతమైన సినిమాను రూపొందించారని సందీప్ రెడ్డి వంగా కొనియాడారు.
ఇలాంటి కథను తెరపైకి తీసుకురావాలంటే అపారమైన ధైర్యంతో పాటు తనపై తనకు గట్టి నమ్మకం ఉండాలని చెప్పారు.
ఆ లక్షణాలు వెంకటేశ్ మహాలో స్పష్టంగా కనిపించాయని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో హీరో సత్యదేవ్ నటన ప్రత్యేకంగా ఆకట్టుకుందని వంగా ప్రశంసించారు.
పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ తన నటనతో మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారని అన్నారు.
సినిమాలో అనవసరమైన హడావుడి, కృత్రిమ అంశాలు లేదా షార్ట్‌కట్‌లు ఎక్కడా కనిపించవని, కథను సహజంగా చెప్పడంపైనే చిత్రబృందం పూర్తిగా దృష్టి పెట్టిందని వివరించారు.
అదే ఈ సినిమాకు ప్రధాన బలమని చెప్పారు.
వివరాలు
విమర్శకులు,సినీప్రముఖుల నుంచి ప్రశంసలు
ఇలాంటి మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరించి,సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సందీప్ రెడ్డి పిలుపునిచ్చారు.
మంచి కథలను ప్రోత్సహించడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమ మరింత ముందుకు సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
వెంకటేశ్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ ప్రధాన పాత్రలో రూపొందిన 'రావు బహదూర్' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను అందుకుంది.
విడుదలైనప్పటి నుంచే విమర్శకులు,సినీప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈచిత్రంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈసినిమాను ప్రశంసిస్తూ,ఇలాంటి తెలుగు చిత్రాన్ని తాను గతంలో చూడలేదని వ్యాఖ్యానించారు.
మరోవైపు హీరో నాగ చైతన్య మాట్లాడుతూ,ఈ సినిమాలో సత్యదేవ్ నటన తనలో అసూయ కలిగించేంత అద్భుతంగా ఉందని కొనియాడారు.