
Maha Kumbh Girl Monalisa: మహకుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా తో సినిమా.. దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించిన పేద కుటుంబానికి చెందిన యువతి మోనాలిసా భోంస్లే (16).
ఆమెకు సోషల్‌మీడియాలో వచ్చిన విపరీతమైన ప్రాచుర్యాన్ని గుర్తించి, బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా సినిమాల్లో అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే తాజా సమాచారం ప్రకారం, ఆయన తీరుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, సనోజ్ మిశ్రా తనను మోసం చేశారని, సినీ అవకాశమిచ్చి మభ్యపెట్టి తీవ్ర వేధింపులకు గురి చేశారని తెలుస్తోంది.
ఈ మేరకు ఝాన్సీకి చెందిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దాంతో, తాజాగా ఢిల్లీ పోలీసులు సనోజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
వివరాలు
టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సనోజ్ మిశ్రాతో పరిచయం
2020లో టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సనోజ్ మిశ్రాతో పరిచయం ఏర్పడిందని, తరచూ ఫోన్ కాల్‌లు చేస్తూ సినిమాల్లో అవకాశాల గురించి మాట్లాడేవారని యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఓసారి ఝాన్సీకి వచ్చి, తాను చెప్పిన చోటుకు రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారని, చేసేదిలేక వెళ్లినప్పుడు రిసార్ట్‌కు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించింది.
అంతేకాకుండా, అసభ్య వీడియోలు చిత్రీకరించి వాటిని బహిర్గతం చేస్తానని బెదిరిస్తూ పలు మార్లు అత్యాచారం చేశారని తెలిపింది.
పెళ్లి చేసుకుంటానన్న వాగ్దానం కూడా చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఈ నేపథ్యంలో, యువతి ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి సనోజ్ మిశ్రాను అరెస్ట్ చేసినట్టు ఆంగ్ల వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి.
వివరాలు
మోనాలిసా భోంస్లే ప్రధాన పాత్ర
మహా కుంభమేళాలో మోనాలిసా భోంస్లే వైరల్ కావడంతో, దర్శకుడు సనోజ్ మిశ్రా తన తర్వాతి చిత్రం 'ది డైరీ ఆఫ్ మణిపుర్'లో ఓ ముఖ్య పాత్ర కోసం ఆమెను ఎంపిక చేశారు.
అంతేకాకుండా, మధ్యప్రదేశ్ వెళ్లి ఆమె కుటుంబ సభ్యుల అనుమతిని కూడా పొందారు.
అప్పట్లో సనోజ్ మాట్లాడుతూ, ''ఇది ఒక ప్రేమకథ. భోంస్లే ప్రధాన పాత్ర పోషించనున్నారు.
ఆమెకు నటనలో శిక్షణ ఇచ్చి, ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభిస్తాం'' అని వెల్లడించారు.