జీవితంలో చాలా కష్టాలు, సమస్యలు వస్తాయి: ఇప్పటి యువతకు సమంత సందేశం
స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన సమంత, ప్రస్తుతం సినిమాలు తక్కువగా చేస్తున్నారు. మయోసైటిస్ చికిత్స కోసం సమంత అమెరికాలో ఉన్నారు. అటు ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూనే, ఇటు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు సమంత. తాజాగా తన అభిమానులతో సమంత ముచ్చటించారు. అందులో ఒక అభిమాని, ఇప్పటి యువతరానికి ఏదైనా సందేశం ఇవ్వమని అడగడంతో, ఇప్పటి యువతరం ప్రతీ చిన్న విషయానికి బాధపడుతుందని, అంతలా బాధపడాల్సిన అవసరం లేదని అన్నారు. చిన్న చిన్న విషయాలకే జీవితం ఏంటి ఇలా అయిపోయిందని బాధకు గురవుతున్నారని, జీవితంలో వెళుతూ ఉన్న కొద్దీ అలాంటి కష్టాలు, సమస్యలు చాలా వస్తాయని వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలని ఆమె అన్నారు.
పాజిటివ్ గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలంటున్న సమంత
25ఏళ్ల వయసులో తాను ఉన్నప్పుడు జీవితంలో ఇప్పటి పరిస్థితి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ఇబ్బందులన్నీ ఒకదాని వెనుక ఒకటిగా వస్తాయని తాను అనుకోలేనని, వాటన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్లానని, పాజిటివ్ గా ఆలోచిస్తూ ముందుకు వెళ్లడమే జీవితమని సమంత తెలియజేశారు. తాజాగా సమంత నటించిన ఖుషి చిత్రం థియేటర్లలో విడుదలైంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా, ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది. ఖుషి తర్వాత సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. సిటాడల్ వెబ్ సిరీస్ ని దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు.