బ్రో సినిమా నుండి మామా అల్లుళ్ళ లుక్ రిలీజ్: అభిమానులకు పూనకాలే
పవన్ కళ్యాణ్, సాయ్ ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది. మొదటిసారిగా మామా అల్లుళ్ళ లుక్ ని రివీల్ చేసింది చిత్రబృందం. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ లుక్ ని సెపరేట్ గా, సాయి ధరమ్ తేజ్ లుక్ ని సెపరేట్ గా రిలీజ్ చేసారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను రిలీజ్ చేసారు. బైక్ మీద కాలుపెట్టి పవన్ కళ్యాణ్ స్టైల్ గా నిలబడి ఉంటే, ఆ పక్కన సాయి ధరమ్ తేజ్ ధీమాగా నిలబడి ఉన్నాడు. ఒకానొక ఫైట్ సీన్ కి సంబంధించిన ఫోటో అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు.
వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్
ఈ సినిమాలో మార్కాండేయులు పాత్రలో కనిపించనున్నారు సాయి ధరమ్ తేజ్. పవన్ కళ్యాణ్ మాత్రం బ్రో గా కనిపించనున్నాడని తెలుస్తోంది. తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతమ్ సినిమాను తెలుగులో బ్రో గా రీమేక్ చేసారు. బ్రో సినిమాకు మాటలను దర్శకుడు త్రివిక్రమ్ అందించారు. రొమాంటిక్ ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జులై 28వ తేదీన బ్రో సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.