Rajinikanth: 'సారీ.. నో కామెంట్స్'.. తిరుమల లడ్డూ వివాదంపై రజనీ కాంత్ స్పందన
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై భక్తులు, ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై వెంటనే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజకీయ, సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. అయితే సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రం ఈ వివాదంపై స్పందించడానికి ఆసక్తి చూపలేదు. తాను ఈ అంశంపై కామెంట్స్ చేయాలనుకోవడం లేదని తెలిపారు. ప్రస్తుతం తన కొత్త చిత్రం 'వేట్టయాన్' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రజనీకాంత్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. లడ్డూ కల్తీ ఆరోపణలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు 'సారీ, నో కామెంట్స్' అని కేవలం తటస్థంగా సమాధానమిచ్చి వెళ్లిపోయారు.
ఆక్టోబర్ 10న 'వెట్టయాన్' రిలీజ్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా మరో నటుడు కార్తి కూడా లడ్డూ వివాదంపై మాట్లాడుతూ ' లడ్డూ గురించి మాట్లాడకూడదు. సున్నితమైన విషయమని సరదాగా వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై తీవ్రంగా స్పందించారు. ఇక రజనీకాంత్ నటిస్తున్న 'వేట్టయాన్' సినిమా అక్టోబర్ 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో రజనీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో కనిపించనుండగా, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.