Dhanush OM Movie: ధనుష్ సీక్రెట్ బయటపెట్టిన శ్రీలీల.. ఆయనలో ఆ ప్రత్యేకత గమనించారా?
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ఓం' (O.M). రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యాంకర్ హీరోయిన్లను సరదా ప్రశ్నలతో సందడి చేశారు. ఇందులో భాగంగా 'ది క్లాసిఫైడ్ మిషన్ ఫైల్' పేరుతో ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధనుష్ గురించి ప్రపంచానికి తెలియని ఓ రహస్యాన్ని బయటపెట్టాలని శ్రీలీలను యాంకర్ కోరారు. దీంతో ఆమె చెప్పిన విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
వివరాలు
ధనుష్‌లోని ప్రత్యేకతను బయటపెట్టిన శ్రీలీల
ఈ సినిమాలో ధనుష్ టాస్క్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా.. ఆయన భార్య రోజా పాత్రను శ్రీలీల పోషిస్తోంది. ఈ నేపథ్యంలో యాంకర్ ఆమెను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు.
'మీరు ధనుష్ గారికి ఫ్యామిలీ ఫ్రెండ్ కదా.. బయటి ప్రపంచానికి తెలియని ఆయన సీక్రెట్ ఏదైనా ఒకటి మాతో పంచుకోండి'' అని ప్రశ్నించారు.
దీనికి శ్రీలీల స్పందిస్తూ.. ''ఆయనకు దగ్గరగా ఉన్నప్పుడే తెలిసే ఓ ప్రత్యేకమైన అనుభూతి ఇది. ఆయన పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక రకమైన విభూతి వాసన (సువాసన) వస్తుంటుంది.
చెన్నైలో జరిగిన ఈవెంట్లో ఈ విషయం చెప్పాను. కానీ మన తెలుగు వాళ్లకు చెప్పలేదు కాబట్టి ఇక్కడ మళ్లీ చెబుతున్నాను'' అని వెల్లడించింది.
వివరాలు
సరదాగా స్పందించిన శ్రీలీల
దీంతో ధనుష్‌లోని ఆధ్యాత్మిక కోణం గురించి శ్రీలీల చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇక ఆన్‌స్క్రీన్ భర్త ధనుష్‌కు ఏదైనా సలహా ఇస్తారా అని యాంకర్ అడగ్గా.. శ్రీలీల సరదాగా స్పందించింది.
'ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది కదా.. కాస్త ఇంట్లో కూడా ఎక్కువ సమయం గడపమని రోజా అడుగుతోందంటూ నవ్వులు పూయించింది.
మరోవైపు ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ నిత్యారెడ్డి పాత్రలో కనిపించనున్న సాయి పల్లవి కూడా యాంకర్ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.
వివరాలు
మమ్ముట్టి 'మేడం' అని పిలవడంపై సాయి పల్లవి స్పందన
చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి ఆమెను 'సాయి పల్లవి మేడం' అని పిలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో ఆమెకు ఎలా అనిపించిందని యాంకర్ అడిగారు.
దీనికి సాయి పల్లవి స్పందిస్తూ.. ''అది ఆయన పెద్దరికం. కానీ ఆయన మనసులో ఇంకా తాను చాలా చిన్న పిల్లాడినని, నేనేదో పెద్దదాన్ని అని అనుకుంటున్నారు.
సెట్లో కూడా ఆయన అందరితో జోకులు వేస్తూ చిన్న పిల్లాడిలాగే సరదాగా ఉంటారు. అందుకే నన్ను మేడం అని పిలిచారు'' అంటూ నవ్వులు పూయించింది.
వివరాలు
'రౌడీ బేబీ' తరహా డ్యాన్సులు ఉండవా?
గతంలో 'మారి 2' సినిమాలో ధనుష్, సాయి పల్లవి కలిసి చేసిన 'రౌడీ బేబీ' పాట ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే.
ఈ నేపథ్యంలో 'ఓం' సినిమాలో కూడా అలాంటి మాస్ డ్యాన్సులు ఉంటాయా అని యాంకర్ ప్రశ్నించారు.
దీనికి సాయి పల్లవి స్పందిస్తూ.. ''కథ చెప్పినప్పుడే దర్శకుడు రాజ్‌కుమార్ గారు.. పల్లవి, ఇందులో ధనుష్ సార్‌తో నీకు ఎలాంటి డ్యాన్సులు ఉండవు అని ముందే చెప్పేశారని స్పష్టం చేసింది.
దీంతో ఈ సినిమాలో ధనుష్, సాయి పల్లవి మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.