Page Loader
Jacqueline Fernandez:ప్రేమికుల రోజున నటి జాక్వెలిన్‌కి రొమాంటిక్ లెటర్ పంపిన ఆర్థిక నేరగాడు
ప్రేమికుల రోజున నటి జాక్వెలిన్‌కి రొమాంటిక్ లెటర్ పంపిన ఆర్థిక నేరగాడు

Jacqueline Fernandez:ప్రేమికుల రోజున నటి జాక్వెలిన్‌కి రొమాంటిక్ లెటర్ పంపిన ఆర్థిక నేరగాడు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)కు జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక నేరస్తుడు సుఖేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) ప్రేమలేఖ రాశాడు. మరో జన్మ ఉంటే ఆమె హృదయంగా పుట్టాలనుందని చెప్పాడు. అలాగే ప్రైవేట్ జెట్‌ను కానుకగా ఇస్తున్నట్లు వెల్లడించాడు. "బేబీ... హ్యాపీ వాలెంటైన్స్ డే! ఈ సంవత్సరం మన ఇద్దరికీ ఎంతో ప్రత్యేకంగా ప్రారంభమైంది. జీవితాంతం ప్రేమికుల దినోత్సవాన్ని కలిసి జరుపుకునే దశలో ఉన్నాం. జాకీ.. నిజంగానే నాకు నువ్వంటే ఎంతో ఇష్టం. ఈ ప్రపంచంలోనే నువ్వే అత్యుత్తమ ప్రియురాలు. నేను నిన్ను పిచ్చివాడిలా ప్రేమిస్తున్నా." అని తన లేఖలో పేర్కొన్నాడు.

వివరాలు 

నాకు మరో జన్మ ఉంటే... నీ హృదయంగా పుట్టాలి

జాక్వెలిన్ వివిధ దేశాలకు ప్రయాణించే సందర్భాల్లో ఆమెకు అంతా సౌకర్యంగా ఉండేందుకు ప్రైవేట్ జెట్‌ను బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపాడు. "నీ పేరులోని తొలి అక్షరాలను ఆ జెట్‌పై రాయించాను. అలాగే నీ పుట్టిన రోజు తేదీతో రిజిస్ట్రేషన్ నంబర్‌ తీసుకున్నాను. ఇకపై ఈ జెట్ ద్వారా నీ ప్రయాణాలు మరింత సులభతరం అవుతాయి." అని చెప్పాడు. తన కోరిక ఏమిటంటే, "నాకు మరో జన్మ ఉంటే... నీ హృదయంగా పుట్టాలి. నీ గుండె చప్పుడుగా మారిపోవాలి. నిన్ను ప్రియురాలిగా కలిగి ఉన్నాను కాబట్టి ఈ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిని" అని సుఖేశ్‌ తన లేఖలో పేర్కొన్నాడు.

వివరాలు 

రూ. 200 కోట్ల కుంభకోణంలో అరెస్ట్ అయిన సుఖేశ్ 

సుఖేశ్ 2020 జూన్ నుంచి 2021 మే వరకు అక్రమంగా మొబైల్ ఫోన్లు, వాయిస్ మాడ్యూలర్లను ఉపయోగిస్తూ ర్యాన్‌బ్యాక్సీ మాజీ యజమాని శివీందర్ సింగ్ భార్య అదితి సింగ్‌కు ఫోన్లు చేశాడు. తనను లా సెక్రటరీ అనూప్‌కుమార్‌గా పరిచయం చేసుకొని, ఆమె భర్తకు బెయిల్ ఇప్పిస్తానని మోసపుచ్చి రూ. 200 కోట్లకు పైగా వసూలు చేశాడు. ఈ కేసులో పోలీసులు సుఖేశ్‌ను అరెస్ట్ చేయగా, ఈ క్రమంలో జాక్వెలిన్‌తో అతడి సన్నిహిత ఫొటోలు బయటపడ్డాయి. ఆమెను తన ప్రియురాలిగా పేర్కొన్నాడు.

వివరాలు 

"అతడు నా జీవితాన్ని నాశనం చేశాడు" - జాక్వెలిన్ 

అయితే సుఖేశ్ తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వాపోయింది. "అతడు నా జీవితంతో ఆడుకున్నాడు. నా కెరీర్‌ను నాశనం చేశాడు" అని న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. అంత జరిగినా సుఖేశ్ మాత్రం జైలులో నుంచే జాక్వెలిన్‌కు ప్రేమలేఖలు రాస్తూనే ఉన్నాడు. ప్రతి పండుగకు ఒక లేఖ రాస్తూ, ఖరీదైన కానుకలు ఇచ్చేలా చెప్పుకుంటూ వస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా "పారిస్‌లో ఒక వైన్ యార్డ్‌ను బహుమతిగా ఇస్తున్నాను" అని తెలిపాడు.