
Tollywood: చిరంజీవితో తీద్దామనుకుని.. చివరకు వెంకటేష్‌తో చిత్రీకరణ - కృష్ణంరాజు కేసుతో డిజాస్టర్
ఈ వార్తాకథనం ఏంటి
ఒక నటుడితో సినిమా తీయాలని మొదలుపెట్టి చివరికి మరొక నటుడితో రూపొందించడం సినిమా పరిశ్రమలో కామన్.
ఇలా మారిన ప్రాజెక్టులలో కొన్ని బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. మరికొన్ని తీవ్రంగా విఫలమయ్యాయి.
అటువంటి నేపథ్యంలోనే ఓ స్టార్ హీరో నటించిన సినిమా విడుదలైన తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది.
కానీ, అనూహ్యంగా మరో హీరో పెట్టిన కేసు కారణంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మారింది.
ఈ పరిణామాలు నిర్మాతకు భారీ నష్టాలను తీసుకొచ్చాయి. ఆ చిత్రమే 'కొండపల్లి రాజా'.
వివరాలు
రజనీకాంత్ హిట్‌కి రీమేక్
1993లో వెంకటేష్ హీరోగా, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 'కొండపల్లి రాజా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇది తమిళంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'అన్నామలై'కి రీమేక్.
తొలుత ఈ రీమేక్‌ను చిరంజీవితో తీయాలని నిర్మాతలు భావించారు.
చిరంజీవికి కూడా కథ నచ్చడంతో, ఇందులో నటించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
అదే సమయంలో వెంకటేష్‌కి కూడా 'అన్నామలై' కథ ఎంతో నచ్చింది.
అప్పటికే వెంకటేష్‌తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న నిర్మాత, ఆయనతోనే 'కొండపల్లి రాజా'ను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు.
చిరంజీవిని పక్కనపెట్టి వెంకటేష్‌ను ఎంపిక చేశారు.
వివరాలు
నగ్మా హీరోయిన్‌గా, భారీ బడ్జెట్‌తో
వెంకటేష్ మార్కెట్ స్థాయికి మించి బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు.
యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో సుమన్ ఓ కీలక పాత్రలో నటించగా, హీరోయిన్‌గా నగ్మా ఎంపికయ్యారు.
సినిమాపై భారీ అంచనాల మధ్య 'కొండపల్లి రాజా' థియేటర్లలో విడుదలైంది.
వివరాలు
ఫస్ట్ డే హిట్ టాక్... కానీ చుక్కలు చూపించిన కేసు
సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ, ఇది తాను రాసిన కథ అని కృష్ణంరాజు కోర్టులో కేసు వేయడం తో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది.
ఆయన ప్రింట్లను సీజ్ చేయాలంటూ కోరడంతో, రెండో రోజు నుంచే చాలా థియేటర్లలో సినిమా ప్రదర్శన నిలిపేశారు.
హిందీ రీమేక్... అక్కడ నుంచి వివాదం
తమిళ 'అన్నామలై' సినిమాను హిందీలో 'ఖుద్‌గర్జ్' పేరుతో రీమేక్ చేశారు.ఈ హిందీ సినిమా తెలుగు రీమేక్ హక్కులు కృష్ణంరాజు తీసుకున్నారు.
ఆయన 'ప్రాణ స్నేహితులు' అనే చిత్రాన్ని ఈ కథ ఆధారంగా నిర్మించారు.
అదే కథతో మళ్లీ వెంకటేష్‌తో 'కొండపల్లి రాజా' తెరకెక్కించడంతో, హక్కుల విషయంపై కృష్ణంరాజు కోర్టులో కేసు వేశారు.
వివరాలు
కేసు ఉపసంహరణ... కానీ అప్పటికే నష్టం
ఈ వివాదం అనంతరం కృష్ణంరాజు న్యాయ వివాదాన్ని పరిష్కరించుకొని కేసు వెనక్కి తీసుకున్నా, అప్పటికే సినిమా నష్టాన్ని ఎదుర్కొంది.
మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఈ వివాదాల కారణంగా 'కొండపల్లి రాజా' సాధించాల్సిన విజయాన్ని సాధించలేక పోయింది.
నిర్మాతకు తీవ్ర ఆర్థిక నష్టం వచ్చింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ 'అన్నామలై' చిత్రం కూడా తెలుగులో డబ్ కావడం విశేషం.