Kotabommali Ps : సినిమా రివ్యూపై చర్చలు, మీడియా ప్రతినిధులుపైన, నిర్మాతలు కింద
హైదరాబాద్'లో సోమవారం కోటబొమ్మాళి పీఎస్ సినిమా ప్రమోషన్స్' జరిగాయి. అందులో భాగంగా ఈసారి మీడియా ప్రతినిధులను స్టేజీపై కూర్చోపెట్టారు. ఇదే సమయంలో పలువురు నిర్మాతలు డయాస్ బయట కూర్చున్నారు.నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, SKN, బన్నీ వాసు పలువురు కింద కూర్చొని వారిని ప్రశ్నలు అడిగారు. సినిమా రిలీజ్ అయ్యే ముందే కొంతమంది దానిపై రివ్యూలు ఇచ్చి సినిమాని దెబ్బతీస్తున్నారని, ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే దాని గురించి మరింత దారుణంగా రివ్యూ రాస్తున్నారని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సినిమా విడుదలయ్యాక వెబ్ సైట్స్,యూట్యూబర్లు తమకి నచ్చినట్లు రివ్యూలు ఇస్తుంటాయి.నెగిటివ్ రివ్యూలు వస్తే కలెక్షన్స్ దెబ్బ తింటున్నాయి. దీనిపై నిర్మాతలు అసంతృప్తికి గురవుతూనే ఉంటారు.
4 రేటింగ్ ఇచ్చాకే షూటింగ్ చేద్దామన్న స్టార్ ప్రొడ్యూసర్
ఒక సినిమా స్క్రిప్ట్ ముందే మీకిస్తానన్న దిల్ రాజు, మీకు నచ్చిన మార్పులు చేసి మీరు 4 రేటింగ్ ఇచ్చిన తర్వాతే షూట్'కి వెళ్తానన్నారు. అప్పుడు సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ ఇవ్వగలరా అంటూ రిపోర్టర్లను ప్రశ్నించారు. తాను డబ్బులు ఖర్చు పెడతానని, ఈ పద్దతిలో సినిమా చేద్దామా అన్నారు. స్పందించిన జర్నలిస్టులు, ఇది సాధ్యం కాదని, ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చన్నారు. రివ్యూలు గతంలో కొందరే రాసేవారని, ఇప్పుడు చాలామంది రాస్తున్నారన్నారు. మన కంటే ముందే అమెరికాలో, విదేశాల్లో సినిమాలు రిలీజ్ అయితే ముందు అక్కడి నుంచే రివ్యూలు వస్తున్నాయన్న అంశం చర్చకు వచ్చింది. సాంకేతికత పెరిగాక రివ్యూలు ఆపడం మనవల్ల కాదని మీడియా ప్రతినిధులు సమాధానం చెప్పారు.