టాలీవుడ్ లో విషాదం: సీనియర్ నటి జమున కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సత్యభామ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అలనాటి అందాల నటి జమున (86) కన్నుమూశారు. గత రాత్రి హైదరాబాద్ లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడ్డ జమున, నిన్న రాత్రి స్వర్గస్తులయ్యారు. 1936 ఆగస్టు 30వ తేదీన కర్ణాటకలోని హంపిలో జన్మించిన జమున, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించింది. 1952లో విడుదలైన "పుట్టిల్లు" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది జమున. నిజానికి ఆమె మొదటి పేరు జానాభాయి. కానీ ఎవరో జ్యోతిష్కులు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు జమునగా పేరు మార్చారు. తెలుగు సినిమాల్లో గడుసు హీరోయిన్ పాత్రలంటే ముందుగా జమున గుర్తొస్తుంది.
రాజకీయాల్లో ప్రవేశించి ఎంపీగా సేవలందించిన జమున
జమున ఖాతాలో ఎన్నో అవార్డులు ఉన్నాయి. 1967లో వచ్చిన హిందీ సినిమా "మిలన్" లో జమున నటనకు , 1964లో వచ్చిన మూగ మనసులు చిత్రంలోని నటనకు ఉత్తమ సహాయ నటిగా ఫిలిమ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు జమున. హీరోయిన్ గా సినిమా రంగంలో రాణించిన జమున, రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర కనబరిచింది. భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మీద అభిమానంతో 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరిన జమున, 1989లో రాజమండ్రి నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1991లో ఓడిపోవడంతో రాజకీయాల నుండి వైదొలిగారు. జమున భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శన కోసం ఫిలిమ్ ఛాంబర్ కి ఈరోజు ఉదయం 11గంటలకు తీసుకువస్తున్నట్లు సమాచారం.