Kollywood :తమిళ సినీ పరిశ్రమలో విషాదం.. ఢిల్లీ గణేష్ కన్నుమూత
ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్(80) కన్నుమూతతో సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. వయోభారం, అనారోగ్యంతో ఆయన గత రాత్రి చెన్నైలోని రామాపురంలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 400కి పైగా సినిమాల్లో తన ప్రతిభ చూపిన ఢిల్లీ గణేష్, అభిమానుల మనసుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నారు. 1944లో నెల్లైలో జన్మించిన ఢిల్లీ గణేష్, 1976లో విడుదలైన 'పట్టిన ప్రవేశం' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన మొదటిది నాటక రంగం ఢిల్లీకి చెందిన దక్షిణ భారత నాటక సభతో ప్రారంభించారు. ఇక 1964 నుంచి 1974 వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కూడా పనిచేశారు. కథానాయకుడిగా కాకపోయినా, క్యారెక్టర్ రోల్స్, విలన్ పాత్రల్లో కూడా ఢిల్లీ గణేష్ ఆకట్టుకున్నారు.
అభిమానులు, సినీ ప్రముఖుల నివాళులు
సీరియస్ పాత్రలు, హాస్య పాత్రల్లోనూ ఆయన తనదైన శైలిని చూపారు. కమల్ హాసన్, రజనీకాంత్, విజయకాంత్ వంటి స్టార్ నటులతో కలిసి పనిచేసిన ఆయన, అవ్వై షణ్ముఖి వంటి చిత్రాల్లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లోనూ అనేక చిత్రాల్లో నటించారు. అంతేకాక, టీవీ సీరియల్స్‌లో కూడా తండ్రి పాత్రలతో ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. వసంతం, కస్తూరి వంటి సీరియల్స్‌లో ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకుల హృదయాలను అలరించాయి. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని చెన్నై రామాపురంలోని నివాసంలో ఉంచారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.