Page Loader
Kanappa: విడుదల వేళ.. కన్నప్ప చిత్రం హార్డ్‌డ్రైవ్‌తో పరారీ.. ఇద్దరిపై కేసు 
విడుదల వేళ.. కన్నప్ప చిత్రం హార్డ్‌డ్రైవ్‌తో పరారీ.. ఇద్దరిపై కేసు

Kanappa: విడుదల వేళ.. కన్నప్ప చిత్రం హార్డ్‌డ్రైవ్‌తో పరారీ.. ఇద్దరిపై కేసు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కన్నప్ప' చిత్రం విడుదలకు ముందే సమస్యల్లో చిక్కుకుంది. ఈ సినిమాతో సంబంధం ఉన్న కీలకమైన సమాచారం ఉన్న హార్డ్‌డ్రైవ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారని తెలిసింది. ఈ ఘటనపై చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఫిలింనగర్‌లో కలకలం రేపుతోంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్‌కుమార్ అనే వ్యక్తి ట్వెంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన నిర్మిస్తున్న 'కన్నప్ప' సినిమా కోసం అత్యంత ముఖ్యమైన కంటెంట్ ఉన్న హార్డ్‌డ్రైవ్‌ను ముంబైలోని HIVI స్టూడియోస్ ఇటీవల కోరియర్ ద్వారా విజయ్‌కుమార్ కార్యాలయానికి, అంటే ఫిలింనగర్‌లోని ఆఫీస్‌కు పంపించింది.

వివరాలు 

కేసు నమోదు.. పోలీసులు దర్యాప్తు 

మే 25వ తేదీన ఆ కొరియర్ పార్సిల్‌ను కార్యాలయంలో పనిచేస్తున్న ఆఫీస్‌బాయ్ రఘు స్వీకరించాడు. అయితే, అతడు ఆ హార్డ్‌డ్రైవ్‌ను ఎవరికీ తెలియకుండా చరిత అనే మహిళకు అప్పగించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అప్పటి నుంచి రఘు, చరిత ఇద్దరూ మాయమయ్యారు. ఈ ఘటనపై విజయ్‌కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. సినిమా ప్రాజెక్ట్‌ను కావాలనే పాడుచేయాలనే ఉద్దేశంతో గుర్తుతెలియని వ్యక్తుల ప్రేరణతో రఘు, చరిత కలిసి కుట్ర పన్నారని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హార్డ్‌డ్రైవ్‌ను అపహరించిన వ్యక్తుల గురించి, వారి వెనుకున్న అసలు ఉద్దేశాల గురించి తెలుసుకోవడంపై పోలీసులు దృష్టిసారించారని సమాచారం.