LOADING...
Tollywood: గ్యాంగ్‌స్టర్ గెటప్‌లో స్టార్ హీరోలు..మాఫియా సామ్రాజ్యాల్లో మాస్ హీరోల మోత
గ్యాంగ్‌స్టర్ గెటప్‌లో స్టార్ హీరోలు..మాఫియా సామ్రాజ్యాల్లో మాస్ హీరోల మోత

Tollywood: గ్యాంగ్‌స్టర్ గెటప్‌లో స్టార్ హీరోలు..మాఫియా సామ్రాజ్యాల్లో మాస్ హీరోల మోత

వ్రాసిన వారు Moogati Shabari
Jun 05, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు హీరో అంటే న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా కనిపించేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ప్రతినాయక లక్షణాలు, గ్యాంగ్‌స్టర్ మనస్తత్వం, మాఫియా డాన్‌ల తరహా ప్రవర్తనతో కూడిన పాత్రల్లో హీరోలు కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తమదైన శైలిలో శత్రువులను ఎదుర్కొంటూ, విలన్లను మట్టికరిపిస్తూ మాస్ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో గ్యాంగ్‌స్టర్ కథలు, మాఫియా డ్రామాలు, రౌడీ పాత్రలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

వివరాలు

 ముంబై మాఫియా నేపథ్యంలో బాలయ్య మూవీ..

ఫ్యాక్షన్ కథలు, మాస్ యాక్షన్ చిత్రాలకు చిరునామాగా నిలిచిన నందమూరి బాలకృష్ణ మరోసారి అలాంటి శక్తివంతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి చేసిన 'వీరసింహారెడ్డి' చిత్రంలో బాలయ్య ఫ్యాక్షన్ నాయకుడిగా అలరించారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రంలో ఆయనను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా చూపించనున్నట్లు దర్శకుడు చెబుతున్నారు. ముంబయి మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ చిత్రంలో బాలకృష్ణ ఓ ప్రభావశీల గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

వివరాలు

ఎన్టీఆర్‌ను అలా చూపించనున్న ప్రశాంత్ నీల్..

దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. భారీ స్థాయిలో సాగే కథలు, బలమైన పాత్రలు ఆయన సినిమాల ప్రత్యేకత. ఇప్పుడు అదే తరహాలో ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందుతున్న 'డ్రాగన్' చిత్రాన్ని తీసుకువస్తున్నారు. 'కేజీఎఫ్'లో బంగారు గనుల నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ కథను, 'సలార్'లో రెండు శక్తివంతమైన సామ్రాజ్యాల మధ్య పోరాటాన్ని చూపించిన ప్రశాంత్ నీల్ ఈసారి ఓపియం వ్యాపారాన్ని కేంద్రంగా చేసుకుని కొత్త యాక్షన్ కథను రూపొందిస్తున్నారు. ఈ కథలో ప్రతి పాత్రలోనూ ప్రతినాయకత్వపు లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పోషిస్తున్న 'లూగర్' పాత్ర కూడా బలమైన విలన్ ఛాయలతో కూడుకున్నదిగా ఉండనుండటంతో ఆసక్తి పెరిగింది.

Advertisement

వివరాలు

ప్యారడైజ్‌లో నాని పాత్ర కూడా అలాంటిందే..

ప్రస్తుతం నాని 'ది ప్యారడైజ్' చిత్రంతో మరో విభిన్న పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న ఈ చిత్రంలో అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడే ఉగ్ర స్వభావం కలిగిన గ్యాంగ్‌స్టర్‌గా నాని కనిపించనున్నారు. ఇదే తరహాలో ఆయన తర్వాత దర్శకుడు సుజీత్‌తో చేయనున్న 'బ్లడీ రోమియో' చిత్రంలోనూ మరో శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. వరుసగా రెండు యాక్షన్ చిత్రాలతో నాని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలంటే కొంతకాలం వేచి చూడాల్సి ఉంది.

Advertisement

వివరాలు

మాస్ యాక్షన్ కథతో రౌడీ హీరో..

ఇక విజయ్ దేవరకొండ కూడా మాస్ యాక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'రౌడీ జనార్ధన' అనే సినిమాలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ప్రచారంలో భాగంగా విడుదల చేసిన సంభాషణలు చిత్రంపై ఆసక్తిని పెంచాయి. టైటిల్‌కు తగ్గట్టుగానే విజయ్ దేవరకొండ ఇందులో శక్తివంతమైన మాస్ రౌడీగా కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తంగా చూస్తే, సంప్రదాయ హీరో పాత్రలకు భిన్నంగా గ్యాంగ్‌స్టర్లు, మాఫియా నాయకులు, రౌడీ పాత్రలతో హీరోలు కొత్త తరహా మాస్ వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement