జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన.. తొలి సినిమాతోనే మెగా హీరోకు గుర్తింపు
69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన సినిమాకు ప్రతిష్ఠాత్మకమైన అవార్డు దక్కింది. 2021-2022లో వచ్చిన సినిమాలకు సంబంధించి కేంద్రం పురస్కారాలను అందిస్తోంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా 2021 ఫిబ్రవరి 12న ఉప్పెన సినిమా విడుదలైంది. మత్స్యకార(గంగపుత్ర) కుటుంబానికి చెందిన యువకుడు(ఆశీ), అదే గ్రామానికి చెందిన గ్రామ పెద్ద కుమార్తె(బేబమ్మ)ను ప్రేమిస్తాడు. ప్రేమ కథాంశం చుట్టూ సాగే ఈ సినిమా మెగా హీరో వైష్ణవ్ తేజ్ కు తొలి తెలుగు సినిమా కావడం విశేషం.
ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఉప్పెన
చిన్న సినిమాగా రిలీజై సూపర్ హిట్ విజయాన్ని కైవసం చేసుకున్న ఉప్పెనలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో(విలన్ గా) నటించాడు. యంగ్ అండ్ ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి బలం చేకూర్చింది. 2021, ఏప్రిల్ 14న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్(ఓటీటీల్లో) విడుదలైంది. మరోవైపు భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డు (National Awards 2023)ని ఎలాంటి అంచనాలు లేని ఉప్పెన గెలుచుకోవడం విశేషం. గురువారం సాయంత్రం 5 గంటలకు దిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జ్యూరీ విలేకరుల సమావేశంలో విజేతలను ప్రకటించారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, శాండల్‌వుడ్ పరిశ్రమలు భాగంగా ఉన్నాయి.