గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి: తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం అంటున్న విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదలైంది. గ్లింప్స్ వీడియోలో మాస్ లుక్ లో విశ్వక్ సేన్ గెటప్ కొత్తగా ఉంది. అన్నాయ్, మేము గోదారోళ్ళం.. మాటొకటే సాగదీస్తాం, తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం అన్న డైలాగ్ తో విశ్వక్ సేన్ పాత్ర ఎలా ఉండబోతుందో గ్లింప్స్ వీడియోలో చూపించారు. గ్లింప్స్ చూస్తుంటే పీరియాడికల్ డ్రామా అన్నట్టుగా కనిపిస్తోంది. యాక్షన్ సీన్లు ఎక్కువగానే ఉన్నాయని గ్లింప్స్ లో చూపించారు. సాయి కుమార్, గోపరాజు రమణ, నాజర్ పాత్రలను గ్లింప్స్ వీడియోలో చూపించారు కాబట్టి వీరి పాత్రలు కీలకంగా ఉండనున్నాయని తెలుస్తోంది.
డిసెంబరులో విడుదల కానున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
హీరోయిన్లు అయిన నేహా శెట్టి, అంజలి పాత్రలను కేవలం ఒకే ఒక్క షాట్ లో చూపించారు. గ్లింప్స్ వీడియో నేపథ్య సంగీతం చాలా చక్కగా కుదిరింది. . గత రెండు మూడు సినిమాల్లో విశ్వక్ సేన్ చాలా క్లాస్ గా కనిపించాడు. ఈ సినిమాలో పూర్తిస్థాయి మాస్ లుక్ లో దర్శనమివ్వబోతున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్ఛూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా, 2023 డిసెంబర్ లో విడుదల కానుందని చిత్రబృందం వెల్లడిచేసింది.