
Vishwambhara: చిరంజీవి, వశిష్ఠ కాంబోలో 'విశ్వంభర.. మూవీ స్టోరీపై రూమర్స్.. చెక్ పెడుతూ స్టోరీ లైన్ చెప్పేసిన దర్శకుడు
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, 'బింబిసార' సినిమాతో గుర్తింపు పొందిన వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రమే 'విశ్వంభర'. ఈ సినిమాకు సంబంధించి కథపై ఇప్పటివరకు అనేకరకాల ఊహాగానాలు, వార్తలు మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే తాజాగా ఆ గాసిప్స్‌కి ఫుల్‌స్టాప్ పెడుతూ, దర్శకుడు వశిష్ఠ స్వయంగా ఈ కథా నేపథ్యాన్ని అధికారికంగా వెల్లడించారు.
వివరాలు
ఈ సినిమాలో బ్రహ్మదేవుడు నివసించే సత్యలోకం
దర్శకుడు వశిష్ఠ మాట్లాడుతూ... "మనకు మొత్తం 14 లోకాలు ఉన్నాయి. వాటిలో 7 పైకి, 7 లోకి ఉంటాయి. ఇప్పటి వరకు వివిధ సినిమాల్లో ఈ 14 లోకాలను దర్శకులు తమకు తోచిన విధంగా చూపించారు. ఉదాహరణకు యమలోకం, స్వర్గలోకం, పాతాళలోకం... ఇవన్నీ ఇప్పటికే చూశాం. కానీ 'విశ్వంభర'లో నేను వీటన్నింటినీ దాటి వెళ్లాను. బ్రహ్మదేవుడు నివసించే సత్యలోకాన్ని ఈ సినిమాలో చూపించాను. ఈ 14 లోకాలే కథకు బేస్‌గా నిలుస్తాయి. ఆ లోకాలకు నేరుగా హీరో ఎలా వెళ్లాడు? అక్కడికి వెళ్లిన హీరోయిన్‌ను ఎలా తిరిగి తీసుకొచ్చాడు?" అనే అంశాలే ఈ కథా నేపథ్యంలో ఉండనున్నాయన్నారు.
వివరాలు
విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ
అలాగే, వాస్తవికతను కలిగించేలా ఈ సినిమాకు సంబంధించి సెట్స్‌ని రూపొందించిన విషయం గతంలో ఒక సందర్భంలో దర్శకుడు వశిష్ఠ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కథ లైన్ కూడా అధికారికంగా చెప్పేసిన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌తో పాటు సినిమా అభిమానులంతా ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలో పేరొందిన ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు ఈ సినిమాకు పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రపంచస్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించాలన్న దిశగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు దర్శకుడు వశిష్ఠ స్పష్టం చేశారు. వీఎఫ్‌ఎక్స్ సాయంతో ఒక కొత్త ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నామని, చిరంజీవిని ఇప్పటి వరకు చూడని కొత్త అవతారంలో చూడబోతున్నారని ఆయన తెలిపారు.
వివరాలు
ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ నటి మౌనీరాయ్
ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారని ఇప్పటికే తెలిసిన విషయమే. అయితే వారితో పాటు బాలీవుడ్ నటి మౌనీరాయ్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా, మెగాస్టార్ బ్లాక్‌బస్టర్ అయిన 'ఖైదీ' సినిమాలో ఉన్న 'రగులుతోంది మెగలిపొద..' అనే పాటను రీమేక్ చేసి, దానిలో మౌనీరాయ్‌తో కలిసి చిరంజీవి స్టెపులు వేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.