Tollywood Producers: వరద భాదితులకు అండగా తెలుగు చిత్ర పరిశ్రమ
ప్రకృతి విపత్తుల సమయంలో తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ ముందుండి సహాయం చేస్తుందని మరోసారి నిరూపితమైంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంభవించిన వరదల వల్ల అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, సినీ పరిశ్రమ బాధితుల సహాయార్థం ముందుకు వచ్చింది. ఇప్పటికే పలువురు ప్రముఖ హీరోలు తమ విరాళాలను ప్రకటించారు, ఇప్పుడు చిత్ర పరిశ్రమ మొత్తం కలిసి బాధితులకు సహాయం అందించేందుకు ముందడుగు వేసింది. ఫిల్మ్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఈ సహాయక చర్యలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఫిల్మ్ ఛాంబర్ తరపున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెరో 25 లక్షల విరాళం ప్రకటించారు.
ప్రతి థియేటర్లలో వస్తువులు,డబ్బులు సేకరించే కేంద్రాలు
అలాగే,తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున రెండు రాష్ట్రాలకు చెరో 10లక్షలు,ఫెడరేషన్ తరపున చెరో 5లక్షల విరాళం ప్రకటించారు. సహాయం అందించదలచినవారు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు లేదా ఫిల్మ్ ఛాంబర్ ద్వారా అందించవచ్చని తెలిపారు. సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ.."ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా,పరిశ్రమ ఎల్లప్పుడూ ముందుంటుంది.డబ్బుతోపాటు, నిత్యావసరాల రూపంలో కూడా సహాయం అందించడానికి కృషి చేస్తాం,"అని అన్నారు. సురేష్ తన కుటుంబం తరపున కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. అలాగే అన్ని థియేటర్లలో వస్తువులు,డబ్బులు సేకరించే కేంద్రాలను ఏర్పాటు చేస్తామని,అవి అవసరమైన వారికి పంపిణీ చేస్తామని తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్‌లో రాఘవేంద్రరావు, దిల్ రాజు,సురేష్ బాబు,భరత్ భూషణ్,దామోదర్ ప్రసాద్,ప్రసన్న కుమార్,జెమినీ కిరణ్,అశోక్ కుమార్,అనిల్,అమ్మిరాజు,భరత్ చౌదరి పాల్గొన్నారు.