Mumbai Rains: ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు..నేడు విద్యా సంస్థలకు సెలవు
భారీ వర్షాలు ముంబై నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ మరో 24 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముంబై, పూణే ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.కొన్ని విమాన సర్వీసులను దారి మళ్లించారు. బుధవారం రాత్రి నుంచి ముంబై, పూణే నగరాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. రోడ్లపై వరద నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. రానున్న 24గంటల్లో వర్షాలు ఇంకా కొనసాగే సూచనలు ఉన్నందున విద్యాసంస్థలను మూసివేశారు. ఇండిగో,విస్తారా,స్పైస్‌జెట్ వంటి విమాన సంస్థలు తమ పలు సర్వీసులను మళ్లించాయి,కొన్ని రద్దు చేయబడ్డాయి.
ముంబైకి రెడ్ అలర్ట్ జారీ
రైల్వే స్టేషన్లు వరద నీటితో మునిగిపోయి, రైల్వే ట్రాక్‌లు నీటిలో కూరుకుపోయాయి. ఈ కారణంగా పలు రైళ్లు రద్దు చేయబడ్డాయి, మరికొన్నింటిని వేరే మార్గాల ద్వారా మళ్లించారు. వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు, పిడుగులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలు పాల్ఘర్,నందూర్బర్,ధూలే,జల్గావ్,సోలాపూర్, సతారాల్లో గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బుధవారం రాత్రి ముంబైలో వర్షాల కారణంగా ఓ మహిళ మ్యాన్‌హోల్‌లో పడిపోయి మృతి చెందింది. ఇక, సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరి,కరైకాల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.