
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో టికెట్లపై 10% రాయితీ నేటి నుంచే
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రకటించిన ప్రయాణ ఛార్జీలపై 10 శాతం రాయితీ ఈ శనివారం నుంచి అమల్లోకి రానుందని ఎల్‌అండ్‌టీ సంస్థ శుక్రవారం ప్రకటించింది.
తాజా ఛార్జీల పెంపు నేపథ్యంలో, దూరాన్ని బట్టి ప్రయాణ ఛార్జీలు ఎంతగా ఉంటాయన్న విషయాన్ని వివరిస్తూ సంస్థ ధరల పట్టికను విడుదల చేసింది.
గతంలో కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠ ఛార్జీ రూ.60 నుంచి రూ.75కి పెరిగిన విషయం తెలిసిందే.
ఇప్పుడు 10 శాతం రాయితీ అనంతరం కనీస ఛార్జీ రూ.11, గరిష్ఠ ఛార్జీ రూ.69గా ఉంటుందని సంస్థ పేర్కొంది. ఇది ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఇచ్చిన సడలింపు అని వెల్లడించింది.
Details
కొన్ని ఫేర్ జోన్లలో రాయితీలు ఇవ్వలేదని విమర్శలు
క్యూఆర్ కోడ్ టికెట్లు, కాగితపు టికెట్లు, టోకెన్లు, డిజిటల్ టికెట్లు, స్మార్ట్‌కార్డులు తదితర అన్ని రకాల టికెట్లపై ఈ రాయితీ వర్తించనుంది. సంస్థ విడుదల చేసిన ధరల పట్టికను పరిశీలిస్తే 'ఇదేంటీ రాయితీ'? అనే ప్రశ్నలు ప్రయాణికుల నుంచి రావడం మొదలైంది.
కొన్ని ఫేర్ జోన్లలో వాస్తవానికి 10 శాతం రాయితీ కూడా ఇవ్వలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉదాహరణకి, 24 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరానికి గరిష్ఠ ఛార్జీ రూ.75 అయితే, 10 శాతం తగ్గింపుతో అది రూ.67.5 కావాలి. కానీ పట్టికలో మాత్రం రూ.69గా చూపించారు.
Details
ప్రయాణికుల్లో అంసతృప్తి
2, 4 కిలోమీటర్ల ఫేర్ జోన్లు తప్ప మిగతా అన్ని జోన్లలో కూడా రాయితీ శాతం పదికి తక్కువగా ఉంది.
ఇంకొక ఉదాహరణగా, 18 కిలోమీటర్లకు పైగా ప్రయాణానికి తాజా ఛార్జీ రూ.60 కాగా, 10 శాతం తగ్గిస్తే అది రూ.54 అవ్వాలి. కానీ సంస్థ రూ.56గా పేర్కొంది.
సమీప ఛార్జీకి సర్దుబాటు చేశారన్న అర్థమూ లేదని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాయితీ పేరిట విడుదల చేసిన ఈ తాజా ధరల పట్టికలో అసలైన తగ్గింపు ఉందా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రయాణికులలో మరింత పెరుగుతున్నాయి.