LOADING...
ఒడిశాలో భారీ వర్షాలు; పిడుగుపాటుకు 10మంది మృతి 
ఒడిశాలో భారీ వర్షాలు; పిడుగుపాటుకు 10మంది మృతి

ఒడిశాలో భారీ వర్షాలు; పిడుగుపాటుకు 10మంది మృతి 

వ్రాసిన వారు Stalin
Sep 03, 2023
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆరు జిల్లాల్లో పిడుగుపాటు కారణంగా పది మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్రానికి చెందిన స్పెషల్ రిలీఫ్ కమిషనర్ తెలిపారు. అంగుల్ జిల్లాలో ఒకరు, బోలంగీర్‌లో ఇద్దరు, బౌధ్‌లో ఒకరు, జగత్‌సింగ్‌పూర్‌లో ఒకరు, దెంకనల్‌లో ఒకరు, ఖోర్ధాలో నలుగురు మరణించారని కమిషనర్ వెల్లడించారు. గాయపడిన ముగ్గురు ఖోర్ధా జిల్లాకు చెందిన వారని ఆయన వెల్లడించారు. భువనేశ్వర్, కటక్ సహా ఒడిశా తీర ప్రాంతంలో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసిందని అధికారి తెలిపారు. రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.

ఐఎండీ

ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం 

పిడుగులు పడే సమయంలో ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది. ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, సెప్టెంబర్ 3 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరొకటి ఏర్పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ హెచ్‌ఆర్ బిస్వాస్ తెలిపారు. దీని ప్రభావంతో తదుపరి 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున, ఒడిశా తీరంలోనే నైరుతి రుతుపవనాలు ఆగిపోయాయి. దీంతో రాబోయే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు.