Telangana Liquor Sales: వెయ్యి కోట్ల మందు విక్రయం.. మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డు!
తెలంగాణలో మద్యం విక్రయాలు మరోసారి ఆల్ టైం రికార్డు సృష్టించాయి. ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో 10 రోజుల్లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం. బార్లు, మద్యం దుకాణాలు, పబ్బులు ఇలా అన్ని ప్రదేశాలలో విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. తద్వారా రాష్ట్ర ఖజానాకు ఎక్కువ ఆదాయం చేకూరింది. హైదరాబాద్ నగరంలో మద్యం అమ్మకాలు అత్యధికంగా నమోదయ్యాయి. పండుగ చివరి రోజుల్లో, శనివారం, ఆదివారం రోజుల్లో విక్రయాలు రెట్టింపు అయ్యాయి. మొత్తం 11 రోజుల్లో తెలంగాణలో 1,000 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని అబ్కారీ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,260 మద్యం దుకాణాలు, 1,171 బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి.
తెలంగాణ
దసరా సందర్భంగా మద్యం విక్రయాలు ఎల్లప్పుడూ పెరుగుతుంటాయి, అందువల్ల ఎక్సైజ్ శాఖ ముందస్తు ప్రణాళికలు తీసుకుని భారీగా నిల్వలను సిద్ధం చేసింది. సెప్టెంబర్ 30, 2024 వరకు మొత్తం 2,838.92 కోట్ల అమ్మకాలు జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్ 1 నుండి 11 తేదీ వరకు, 1,057.42 కోట్ల విలువైన 10.44 లక్షల కేసుల మద్యం విక్రయించినట్లు నిపుణులు వెల్లడించారు. అంతేకాకుండా, 17.59 లక్షల కేసుల బీర్లు కూడా అమ్ముడయ్యాయి. విక్రయాలలో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలున్నాయి. పండుగ చివరి మూడు రోజులు మద్యం విక్రయాలు మరింత పెరిగాయి. ఎక్సైజ్ డిపోల నుంచి రూ.205.42 కోట్ల విలువైన మద్యం రిటైల్ షాపులకు చేరింది.