Mumbai: ముంబై పర్యాటక పడవ బోల్తా.. 13 మంది మృతి
ముంబై తీరంలో బుధవారం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ఉన్న నీల్‌కమల్ పడవ నేవీ స్పీడ్ బోట్ ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 110మందికిపైగా ప్రయాణికులు ఉండగా,ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 101మందిని రక్షించినట్లు సమాచారం.ప్రస్తుతం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 3:55 గంటలకు బుచార్ ద్వీపం సమీపంలో నేవీ బోట్ ఢీకొనడంతో నీల్‌కమల్ పడవ బోల్తా పడింది. రాత్రి 7:30 గంటల వరకు అందిన వివరాల ప్రకారం, 13 మంది మరణించగా, 10 మంది పౌరులు మరియు ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 5 లక్షలు
సీఎం ఫడ్నవిస్ ప్రకటించిన ప్రకారం, ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 5 లక్షలు అందజేస్తారు. నీల్‌కమల్ పడవ, ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ఎలిఫెంటా ద్వీపానికి ప్రయాణీకులను తీసుకెళ్తుండగా, నేవీ స్పీడ్ బోట్ అదుపు తప్పి ఢీకొట్టింది. కొత్త ఇంజిన్ పరీక్షించడంలో బోట్ నియంత్రణ కోల్పోయినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రమాద ప్రాంతంలో 11 నేవీ బోట్లు, మూడు మెరైన్ పోలీసు బోట్లు, కోస్ట్ గార్డ్ బోట్‌లు మోహరించబడగా, నాలుగు హెలికాప్టర్లు రంగంలోకి దించారు. స్థానిక మత్స్యకారులు కూడా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలను గురువారం వెల్లడించనున్నట్లు సీఎం తెలిపారు.