Manipur: మణిపూర్‌లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు, 13 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలోని లీతు గ్రామంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు రెండు గ్రూపులు జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు.
ఈ ప్రాంతంలోని తిరుగుబాటు బృందం మయన్మార్‌కు వెళ్తున్న ఉగ్రవాదులపై మెరుపుదాడి చేసింది.
ఈ దాడిలో మరణించిన 13 మృతదేహాలను ఇప్పటి వరకు వెలికి తీసినట్లు అస్సాం రైఫిల్స్ అధికారులు వెల్లడించారు.
అయితే చనిపోయిన వారు స్థానికులు కాదని తెలుస్తోంది. మయన్మార్‌తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకునే కుకీ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మణిపూర్
మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేసిన తర్వాత ఈ ఘటన
మే 3 నుంచి మణిపూర్‌లో మైతీ, కుకీ వర్గాల మధ్య జాతి ఘర్షణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ ఘర్షణ కారణంగా ఇప్పటి వరకు 182 మంది మరణించారు. 50 వేల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది.
వారు కొన్ని నెలలుగా సహాయక శిబిరాల్లో నివసిస్తున్నారు. ఏడు నెలల తర్వాత ఆదివారం రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం ఎత్తివేసిన తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే, కొన్ని జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి.