1984 Anti Sikh Riots: హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (Sajjan Kumar) తండ్రీకొడుకులను సజీవదహనం చేసిన కేసులో జీవితఖైదు పడింది.
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) ఆయనకు ఈ శిక్షను విధిస్తూ తీర్పు ప్రకటించింది.
ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా (Justice Kaveri Baweja) సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు విధిస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఇప్పటికే 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన మరో కేసులో సజ్జన్ కుమార్ జీవితఖైదు అనుభవిస్తున్నారు.
అదే అల్లర్ల సమయంలో,1984 నవంబర్ 1న ఢిల్లీలోని సరస్వతి నగర్‌లో సిక్కు మతానికి చెందిన తండ్రీకొడుకులను అల్లరి మూక సజీవదహనం చేసింది.
వివరాలు
సిక్కులపై దాడులు
ఈ కేసులో కూడా నిందితుడిగా ఉన్న సజ్జన్ కుమార్‌ను ఈ నెల 12న కోర్టు దోషిగా తేల్చగా, నేడు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.
1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా సిక్కులపై దాడులు ప్రారంభమయ్యాయి.
అదే క్రమంలో నవంబర్ 1న ఢిల్లీలో తండ్రీకొడుకులైన జశ్వంత్ సింగ్, తరుణ్‌దీప్ సింగ్ ఇంటిపై అల్లరి మూక దాడి చేసింది.
వారు ఇంటిని ధ్వంసం చేసి, ఆపై నిప్పంటించి తండ్రీకొడుకులను సజీవదహనం చేసింది. ఈ ఘటనపై జశ్వంత్ సింగ్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది.
వివరాలు
అల్లరి మూకకు నాయకత్వం వహించిన సజ్జన్ కుమార్
సజ్జన్ కుమార్ ఈ దాడిలో కేవలం ఒక సాధారణ సభ్యుడిగా కాకుండా, ప్రధానంగా అల్లరి మూకకు నాయకత్వం వహించినట్లు కోర్టు తీర్పులో పేర్కొంది.
న్యాయమూర్తి కావేరీ బవేజా వ్యాఖ్యానిస్తూ, అతడు చేసిన నేరానికి గరిష్ఠ శిక్షగా మరణదండన విధించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, తీహార్ జైల్లో అతని ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని జీవిత ఖైదు విధిస్తున్నామని పేర్కొన్నారు.