Andhra Pradesh: రూ.20కే కేజీ గోధుమ పిండి.. తెనాలిలో ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
ఈ వార్తాకథనం ఏంటి
కిలో రేషన్ బియ్యానికి ప్రభుత్వం రూ.47.10 వరకు ఖర్చు చేస్తోందని,పాలిష్ చేసిన సన్నబియ్యంతో పోలిస్తే ఈ బియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలుకలిగిస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రేషన్ కార్డుదారులకు కేవలం రూ.20కే గోధుమ పిండిని అందించే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రోజుకు సుమారు 1,800 టన్నుల గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నామని, త్వరలో అన్ని ప్రాంతాలకు ఈ సరఫరాను విస్తరిస్తామని తెలిపారు. గత వైకాపా పాలనలో రేషన్ పంపిణీ విధానం కొద్ది మందికే ప్రయోజనం చేకూరేలా మారిందని విమర్శించారు.
వివరాలు
నెలకు 15 రోజుల పాటు చౌకధరల దుకాణాలు
రేషన్ కార్డులను సైతం తమ స్వంత కార్యక్రమంలా మార్చి, వాటిపై తమ ఫొటోలు, రంగులు ముద్రించారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చౌకధరల దుకాణాలు నెలకు 15 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రజలకు అందుబాటులో ఉండేలా మార్పులు చేపట్టామని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఏ చౌకధరల దుకాణంలోనైనా సరకులు తీసుకునే వెసులుబాటు కల్పించామని, అలాగే డీలర్ల ఆదాయం పెరిగేలా రానున్న రోజుల్లో కొండప్రాంతాల ఉత్పత్తులు, ఇతర సేంద్రియ సాగు ఉత్పత్తులను కూడా వారి ద్వారానే ప్రజలకు చేరువ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.