2019-2021 మధ్య 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు మిస్సింగ్: కేంద్రం వెల్లడి
దేశంలో బాలికలు, మహిళల మిస్సింగ్‌పై ఆదివారం కేంద్ర ప్రభుత్వం కీలక నివేదికను విడుదల చేసింది. 2019-2021 మధ్య మూడేళ్లలో దేశంలో 13.13 లక్షల మంది బాలికలు, మహిళలు అదృశ్యమైనట్లు కేంద్రం వెల్లడించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఈ డేటాను రూపొందించింది. మిస్సింగ్ జాబితాలో మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా దాదాపు 2లక్షల మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానంలో ఉంది. గత వారం పార్లమెంట్‌లో సమర్పించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 2019-2021 మధ్యకాలంలో 18ఏళ్లు పైబడిన మహిళలు 10,61,648 మంది, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న 2,51,430 మంది బాలికలు అదృశ్యమయ్యారు.
ఏ రాష్ట్రంలో ఎంతమంతి మిస్సింగ్ అంటే?
మధ్యప్రదేశ్‌లో 2019-2021 మధ్య 1,60,180 మంది మహిళలు, 38,234 మంది బాలికలు కనిపించకుండా పోయారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన నివేదికలో పేర్కొంది. ఇదే కాలంలో పశ్చిమ బెంగాల్‌లో 1,56,905 మంది మహిళలు, 36,606 మంది బాలికలు అదృశ్యమయ్యారు. మహారాష్ట్రలో 1,78,400 మంది మహిళలు, 13,033 మంది బాలికలు మిస్సింగ్ లీస్ట్‌లో ఉన్నారు. ఒడిశాలో మూడేళ్లలో 70,222 మంది మహిళలు, 16,649 మంది బాలికలు, ఛత్తీస్‌గఢ్‌లో 49,116 మంది మహిళలు, 10,817 మంది బాలికలు అదృశ్యమయ్యారు. దిల్లీలో 61,054 మంది మహిళలు, 22,919 మంది బాలికలు, జమ్ముకశ్మీర్‌లో 8,617 మంది మహిళలు, 1,148 మంది బాలికలు తప్పిపోయారు.