
Tahawwur Rana: తహవ్వూర్ రాణాను 18 రోజుల NIA కస్టడీ
ఈ వార్తాకథనం ఏంటి
ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన కుట్రకర్తగా భావిస్తున్న తహవ్వుర్ హుస్సేన్ రాణాను 18 రోజుల పాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
గురువారం అర్ధరాత్రి సమయంలో, పాటియాలా హౌస్ కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట ఎన్‌ఐఏ అధికారులు అతనిని హాజరుపరిచారు.
ఈ సమయంలో ఎన్‌ఐఏ కార్యాలయంతోపాటు కోర్టు పరిసరాల్లో గట్టి భద్రత చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే... ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి చందర్‌జిత్ సింగ్ ముందు రాణాను ప్రవేశపెట్టిన ఎన్‌ఐఏ తరఫున సీనియర్ న్యాయవాదులు నరేందర్ మాన్, దయాన్ కృష్ణన్ వాదనలు వినిపించారు.
రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెందిన న్యాయవాది పీయూష్ సచ్‌దేవా కోర్టులో వాదనలు జరిపారు.
వివరాలు
18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి
విచారణ సందర్భంగా కోర్టు గదిలోకి ఇతరులను అనుమతించలేదు.భద్రత కారణంగా, మీడియా ప్రతినిధులను కూడా బయటకు పంపించారు.
ముంబై దాడుల కేసులో విచారణ కొనసాగించేందుకు 20 రోజుల కస్టడీ అవసరంనని ఎన్‌ఐఏ తరఫున దయాన్ కృష్ణన్ అభ్యర్థించారు.
కానీ, న్యాయస్థానం 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి మాత్రమే అనుమతిచ్చింది.
అర్ధరాత్రి వరకూ వాదనలు కొనసాగగా, రాణా పాత్రకు సంబంధించి కొంత కీలకమైన ఆధారాలను కూడా ఎన్‌ఐఏ కోర్టుకు సమర్పించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో కోర్టు, ఎన్‌ఐఏ కార్యాలయ ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.
వివరాలు
ద్రతా బలగాల నడుమ పాటియాలా హౌస్ కోర్టుకు..
ఇదిలా ఉండగా, ముంబై ఉగ్రదాడుల కేసులో ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన రాణాను ఎట్టకేలకు భారత అధికారులు అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చారు.
లాస్ ఏంజెలెస్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం గురువారం సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
విమానం దిగిన వెంటనే ఎన్‌ఐఏ బృందం అతనిని అధికారికంగా అరెస్ట్ చేసి, భద్రతా బలగాల నడుమ పాటియాలా హౌస్ కోర్టుకు తీసుకెళ్లారు.