Hydra: 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. ప్రభుత్వానికి హైడ్రా నివేదిక
హైదరాబాద్‌లో అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు 'హైడ్రా' రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఆక్రమణదారుల నుంచి వంద ఎకరాలకు పైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గత రెండు నెలలుగా చెరువులు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది.
అత్యధికంగా అమీన్ పూర్ లో 51 ఎకరాలు స్వాధీనం
రామ్‌నగర్ మణెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్‌పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను తొలగించింది. అత్యధికంగా అమీన్‌పూర్‌లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. హైడ్రా కోసం ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని నియమించింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులు ఆక్రమణల కూల్చివేత కోసం పనిచేయనున్నారు.