Flamingos Found Dead: విమానం ఢీకొని 36 ఫ్లెమింగోలు మృతి
మహారాష్ట్ర ఆర్థిక రాజధాని ముంబైలోని ఘట్‌కోపర్‌లోని పంత్‌నగర్‌లోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో ఎమిరేట్స్ విమానం ఢీకొనడంతో కనీసం 36 ఫ్లెమింగోలు మరణించాయి. ఎమిరేట్స్ విమానం ఈకే 508 సోమవారం రాత్రి 9.18 గంటలకు పక్షుల్ని ఢీకొట్టినట్లు సమాచారం వచ్చిందని, ఆ తర్వాత సుక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో 36 ఫ్లెమింగో కళేబరాలు లభ్యమయ్యాయని, మరిన్ని ఫ్లెమింగోలు చనిపోయాయో లేదో తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించామని అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్‌వై రామారావు తెలిపారు. ఘాట్‌కోపర్‌లో చాల చోట్ల చనిపోయిన పక్షుల విరిగిన రెక్కలు, గోళ్లు, ముక్కులు అన్ని చెల్లాచెదురుగా పడ్డాయి.
చిత్తడి నేలలు ఫ్లెమింగోలకు ఆవాసాలు
వీటి మరణానికి ఖచ్చితమైన కారణాలను కనుగొనేందుకు కళేబరాలను శవపరీక్షలకు పంపినట్లు 'రైజింగ్ అసోసియేషన్ ఫర్ వైల్డ్‌లైఫ్ వెల్ఫేర్' (RAWW) వ్యవస్థాపకుడు,పవన్ శర్మ తెలిపారు. అయితే ఈ విషయమై విమానయాన సంస్థ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ముంబై, నవీ ముంబై తీరం వెంబడి ఉన్న చిత్తడి నేలలు ఫ్లెమింగోలకు ఆవాసాలుగా ఉన్నాయి. వలస పక్షలు డిసెంబర్‌లో ఈ తీర ప్రాంతాలకు చేరుకుంటాయి. మార్చి-ఏప్రిల్ వరకు కనిపిస్తుంటాయి.